రొయ్యల పులావ్ తయారీకి నాణ్యమైన తాజా రొయ్యలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బియ్యం పొడిపొడిగా రావడానికి బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టి వండుకోవాలి. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, వాటి కొలతలు ఇక్కడ ఉన్నాయి. కేవలం వంట గదిలో దొరికే వస్తువులతోనే అద్భుతమైన రుచిని పొందేలా సిద్ధం చేసుకోవచ్చు. మీరు మొదటిసారి ప్రయత్నిస్తున్నా, ఈ కొలతలతో చాలా సులభంగా తయారు చేయవచ్చు. అద్భుతమైన సువాసనతో, వేడివేడిగా వడ్డించే ఈ పులావ్ మీ ఆదివారాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తుంది.
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 1 కప్పు
రొయ్యలు: 200 గ్రాములు
ఉల్లిపాయ: 1 (మధ్యస్థ పరిమాణం, ముక్కలుగా తరిగినది)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పుదీనా: ఒక గుప్పెడు
పచ్చిమిరపకాయలు: 1 నుండి 2
గరం మసాలా లేదా బిర్యానీ మసాలా: ½ నుండి ¾ టీస్పూన్
ధనియాల పొడి: ½ నుండి ¾ టీస్పూన్
కారం పొడి: ¼ టీస్పూన్
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొబ్బరి పాలు లేదా నీరు: 2-3 టేబుల్ స్పూన్లు
నూనె: తగినంత
నిమ్మరసం: కొద్దిగా
మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, పచ్చి యాలకులు (3), లవంగాలు (4-6), దాల్చినచెక్క (2 అంగుళాలు), షాహీ జీరా (½ టీస్పూన్), నక్షత్ర పువ్వు (1), జావిత్రి (1)
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత అన్నంలా వండుకోవాలి (ఎక్కువ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి). రొయ్యలను వెనిగర్‌తో కడిగి శుభ్రం చేసి, అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె వేడి చేసి మసాలా దినుసులు, షాహీ జీరా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి రంగు మారే వరకు వేయించి, మ్యారినేట్ చేసిన రొయ్యలను వేయాలి. రొయ్యలు పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత, పుదీనా కొబ్బరి పాలు (లేదా కొద్దిగా నీరు) పోసి రొయ్యలను మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. రొయ్యలు మరీ ఎక్కువగా ఉడికితే రబ్బరులా అవుతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న అన్నం నిమ్మరసం కలిపి బాగా కలపాలి. వేడివేడి రొయ్యల పులావ్ సర్వింగ్‌కు సిద్ధం. తాజా ఉల్లిపాయలు, పెరుగు రైతాతో వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది.
గమనిక
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. రొయ్యల నాణ్యతను పరీక్షించుకోవడం ఆహార పదార్థాల పట్ల ఏవైనా అలెర్జీలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఆదివారం వంటి రోజుల్లో ఈ వంటకాన్ని రుచి చూడండి.