Headlines

PM Modi: పార్టీ కాదు.. దేశ హితమే ముఖ్యం.. మహిళా రిజర్వేషన్ల అంశంలో విపక్షాలపై తీరుపై మోదీ ఫైర్


మహిళా రిజర్వేషన్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన, మహిళా సాధికారత విషయంలో తమ నిబద్ధతను స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న వీడియో సందేశంలో మహిళల హక్కులు, భాగస్వామ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం సాగుతోందని, ఆ ప్రయత్నంలో తాను కూడా ఏళ్లుగా భాగస్వామినని అన్నారు.

దళ హితం పెద్దదైతే నష్టపోయేది మహిళా శక్తి, దేశమే

మహిళా సాధికారత పట్ల బీజేపీ, ఎన్డీఏ కూటమి సంకల్పం చెక్కుచెదరనిదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనమే ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ‘‘కొంతమందికి పార్టీ ప్రయోజనాలే సర్వస్వం అయినప్పుడు, జాతీయ ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే గొప్పవిగా అనిపించినప్పుడు, దాని పర్యవసానాలను మహిళా శక్తి, జాతీయ ప్రయోజనాలు భరించాల్సి వస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు.

నారీ శక్తి వందన్ సవరణ తప్పక నెరవేరుస్తాం

నారీ శక్తి వందన్ సవరణ ప్రస్తుత కాలపు అత్యంత ఆవశ్యకమైన అంశమని ప్రధాని అభివర్ణించారు. ఈ తీర్మానాన్ని ఏ పరిస్థితుల్లోనైనా నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన ఆత్మవిశ్వాసం అమోఘమైనది. జనాభాలో సగభాగం మంది కలల కోసం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మనం ఈ తీర్మానాన్ని తప్పక నెరవేర్చాలి’’ అని ఆయన తన సందేశంలో వెల్లడించారు.

అంతకుముందు పంచుకున్న పోస్ట్‌లో ఏముంది?

ఈ తాజా పోస్ట్‌కు ముందు ప్రధాని మోదీ శనివారం ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, మహిళల హక్కులకు అడ్డుగా నిలుస్తున్న “అన్ని అడ్డంకులను తొలగిస్తామని” అందులో హామీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *