Headlines

Papaya: బొప్పాయి తింటే బరువు తగ్గుతారా..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా..

Papaya: బొప్పాయి తింటే బరువు తగ్గుతారా..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా..


బొప్పాయిని ప్రతిరోజు 100 నుండి 200 గ్రాములు తినడం వల్ల బరువు చాలా వేగంగా తగ్గుతారనే నమ్మకం చాలా మందిలో ప్రచారంలో ఉంది. అయితే, ఈ వాదనలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. బొప్పాయి నిస్సందేహంగా ఆరోగ్యకరమైన పండు. ఇందులో ఫైబర్, విటమిన్ ఏ, అధిక నీటి శాతం ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్ మాత్రం దాదాపుగా ఉండదు. ఈ కారణం వల్ల, బొప్పాయిని భోజనానికి ప్రత్యామ్నాయంగా (మీల్ రీప్లేస్‌మెంట్‌) తీసుకోవడం సరికాదు. కేవలం బొప్పాయిని నిరంతరం తీసుకోవడం ద్వారా గణనీయంగా బరువు తగ్గుతారనేది ఒక అపోహ మాత్రమే, వాస్తవం కాదు.

బరువు తగ్గడానికి సమగ్రమైన విధానం అవసరం. కేవలం ఒక పండు తినడం ద్వారా బరువు తగ్గుతామనే ఆలోచన చాలా తప్పు. ఎందుకంటే, ఏ ఒక్క పండులోనూ శరీరానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు ఉండవు. ప్రతి పండులోనూ ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, బొప్పాయిలో విటమిన్ ఏ, కొంత ఫైబర్ (100 గ్రాములకు సుమారు 2.5 గ్రాములు) మాత్రమే ఉంటుంది. అయితే, ఆపిల్‌లో 3 గ్రాముల ఫైబర్ ఉండగా, జామకాయలో 5.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఈ పోలిక బొప్పాయిలో ఫైబర్ శాతం ఇతర పండ్లతో పోలిస్తే తక్కువ అని సూచిస్తుంది.

సీజనల్ పండ్లను చేర్చుకోవడం ద్వారా..

శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందాలంటే, రోజువారీ ఆహారంలో వివిధ రకాల సీజనల్ పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీనిని “రెయిన్‌బో డైట్” అని పిలుస్తారు. ఉదాహరణకు, దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది.. జామకాయలో ఫైబర్ ఎక్కువ.. పుచ్చకాయలో 90% నీరు, ఐరన్ ఉంటాయి. ఈ విధంగా రంగురంగుల పండ్లను తీసుకోవడం వల్ల అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పండ్లలోని అధిక నీటి, ఫైబర్ కంటెంట్ వల్ల కడుపు నిండిన భావన కలిగి, ఆకలి తగ్గుతుంది. ఇది పరోక్షంగా తక్కువ ఆహారం తీసుకోవడానికి, తద్వారా బరువు తగ్గడానికి కొంతవరకు సహాయపడవచ్చు.. కానీ ఇది బరువు తగ్గడానికి 100% పరిష్కారం కాదు.

బరువు తగ్గాలని కోరుకునే వారు కేవలం పండ్లపై లేదా ద్రవ ఆహారాలపై, లేదా కేవలం కూరగాయల డైట్లపై ఆధారపడకూడదు. ఇలాంటి ఏకపక్ష డైట్‌లు ప్రోటీన్ లోపానికి దారితీయవచ్చు. ప్రోటీన్ లోపం వల్ల కండరాల బలం తగ్గడం, బలహీనత, కండరాల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సరైన మార్గదర్శకత్వం లేకుండా ఇటువంటి డైట్‌లు అనుసరించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండాల్సి రావచ్చు.

కాబట్టి, బరువు తగ్గడానికి సరైన, శాస్త్రీయమైన పద్ధతిని పాటించాలి. ఇందులో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, నిర్ణీత సమయానికి భోజనం చేయడం, స్థానికంగా లభించే సీజనల్ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం. పిల్లలు – పెద్దలు అందరూ ప్రతిరోజూ కనీసం ఒక పండును తప్పకుండా తీసుకోవాలి. సమగ్రమైన డైట్ ప్లాన్‌లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్ వంటి అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఒక నిపుణుడి పర్యవేక్షణలో బరువు తగ్గడానికి ప్రణాళిక వేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను, పోషకాహార లోపాలను సమర్థవంతంగా నివారించవచ్చు.

గమనిక.. ఈ వార్తా కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.. 

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *