ఈ మధ్యన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. ప్రపంచ చరిత్రలో చోటుచేసుకున్న అతిపెద్ద మానవ తప్పిదాన్ని ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఈ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. కేవలం 5 ఎపిసోడ్‌లతో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్ ను కచ్చితంగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వంటి 5 భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉండడంతో అందరూ ఈ సిరీస్ ను చూసేస్తున్నారు. ఐఎమ్ డీబీ ప్లాట్ ఫామ్ లోనూ ఈ సిరీస్ కు 9.3 రేటింగ్ దక్కడం విశేషం. ఇంతకీ ఈ రియల్ థ్రిల్లర్ సిరీస్ ఏంటనుకుంటున్నారా? చెర్నోబిల్..
1986 ఏప్రిల్ 26న అప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత ఉక్రెయిన్) లోని చేర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన భయంకరమైన దుర్ఘటన ఆధారంగా చెర్నోబిల్ సిరీస్ ను తెరకెక్కించారు. ప్లాంట్‌లోని ఓ యూనిట్ రియాక్టర్‌లో తక్కువ విద్యుత్ సామర్థ్యంతో సేఫ్టీ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ భయంకరమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రియాక్టర్ భవనం తీవ్రంగా ధ్వంసమై, వాతావరణంలోకి అధిక పరిమాణంలో రేడియోధార్మిక పదార్థాలు వెలువడ్డాయి. అంతేకాదు ప్రమాదం జరిగిన తర్వాత రియాక్టర్ కోర్‌లోకి గాలి చొరబడటంతో గ్రాఫైట్ మోడరేటర్‌లో మంటలు చెలరేగి, కొన్ని రోజుల పాటు రేడియోధార్మిక పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలో భాగంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు, అగ్ని మాపక సిబ్బంది, సైనికులు సైతం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇప్పుడీ సంఘటన ఆధారంగా చెర్నోబిల్ సిరీస్ ను తెరకెక్కించారు క్రియేటర్ క్రెగ్ మేజిన్. జోహాన్ రెంక్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. జారెడ్ హ్యారిస్, స్టెల్లన్ స్కార్స్‌గార్డ్, ఎమిలీ వాట్సన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా విపత్తు జరిగిన ప్రదేశంలో భయానక వాతావరణాన్ని, రేడియేషన్ కారణంగా బాధితులు అనుభవించిన నరకయాతనను ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్టు చూపించారు.
ప్రస్తుతం చెర్నో బిల్ వెబ్ సిరీస్ ప్రము ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటలో ఉంది.
ఇవి కూడా చదవండి
చెర్నోబిల్ వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.