MI vs PBKS : మృత్యుంజయ్ శశాంక్ సింగ్.. తలకు తూటా లాంటి బంతి తగిలినా, ముంబై గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు

MI vs PBKS : మృత్యుంజయ్ శశాంక్ సింగ్.. తలకు తూటా లాంటి బంతి తగిలినా, ముంబై గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు


MI vs PBKS : ఐపీఎల్ 2026లో ఆటగాళ్ల గాయాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఆల్ రౌండర్ శశాంక్ సింగ్ తన కెప్టెన్ విసిరిన బంతి తలకు బలంగా తగలడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, కొద్దిసేపటికే పట్టుదలతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన శశాంక్.. ముంబై బ్యాటర్ల ఊచకోతకు అడ్డుకట్ట వేసి పంజాబ్ తలరాతను మార్చేశాడు.

ముంబై ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో ఈ ఊహించని సంఘటన జరిగింది. నమన్ ధీర్ వేగంగా సింగిల్ తీస్తుండగా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు స్టంప్స్ ని టార్గెట్ చేస్తూ బలంగా విసిరాడు. అయితే ఆ బంతి నేల మీద పడి అనూహ్యంగా బౌన్స్ అయ్యి, అటువైపు ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ తలకు బలంగా తగిలింది. ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిన శశాంక్.. వెంటనే వైద్య బృందం సహాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతను డగౌట్‌లో తలకు ఐస్ ప్యాక్ పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.

శశాంక్ మైదానంలో లేని సమయంలో క్వింటన్ డికాక్, నమన్ ధీర్ కలిసి పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ కలిసి 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వికెట్ కోసం పంజాబ్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణంలో శశాంక్ సింగ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనికి బంతిని అప్పగించగా, తల దెబ్బను కూడా మర్చిపోయి శశాంక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

సెట్ అయిన బ్యాటర్ నమన్ ధీర్ (50)ను అవుట్ చేయడం ద్వారా శశాంక్ సింగ్ ముంబై భారీ పార్టనర్ షిప్ విడదీశాడు. ముంబైని కనీసం 220 పరుగుల స్కోరు దిశగా వెళ్లకుండా అడ్డుకోవడంలో శశాంక్ తీసిన ఈ వికెట్ అత్యంత కీలకంగా మారింది. గాయపడినప్పుడు మైదానంలో నిశ్శబ్దం అలుముకోగా, అతను వికెట్ తీసినప్పుడు పంజాబ్ అభిమానుల కేకలతో వాంఖడే దద్దరిల్లింది.

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటికే ఎంతోమంది ఆటగాళ్ల గాయాలతో వార్తల్లో నిలిచింది. కానీ శశాంక్ సింగ్ చూపిన తెగువ మాత్రం ప్రత్యేకమని చెప్పాలి. తన కెప్టెన్ వల్లనే గాయపడినా, ఆ కోపాన్ని గానీ, నొప్పిని గానీ మనసులో పెట్టుకోకుండా జట్టు కోసం తిరిగి వచ్చి వికెట్ తీయడం అతని క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. డికాక్ ఒకవైపు సెంచరీతో చెలరేగుతున్నా, శశాంక్ వేసిన ఈ దెబ్బ ముంబై వేగాన్ని తగ్గించి, పంజాబ్ గెలుపు ఆశలను సజీవంగా ఉంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *