LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్లో అంపైర్ల తప్పిదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం ఏప్రిల్ 26న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక భయంకరమైన పొరపాటు జరిగింది. ఈ పొరపాటు జరగకపోయి ఉంటే సంజీవ్ గోయెంకా టీమ్ లక్నో ఎప్పుడో గెలిచేది. కానీ అంపైర్ చేసిన చిన్న తప్పు వల్ల మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. తీరా సూపర్ ఓవర్లో లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
12వ ఓవర్లో అసలేం జరిగింది?
కోల్‌కతా విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు 12వ ఓవర్లో అన్యాయం జరిగింది. కేకేఆర్ బౌలర్ కార్తీక్ త్యాగి వేసిన ఆ ఓవర్ మొదటి బంతికి రిషబ్ పంత్ ఒక భారీ షాట్ ఆడాడు. బంతి క్లియర్‌గా బౌండరీ లైన్ అవతల పడింది. టీవీ గ్రాఫిక్స్‌లో కూడా అది 63 మీటర్ల సిక్సర్ అని చూపించారు. కానీ మైదానంలోని అంపైర్ మాత్రం దాన్ని ఫోర్‌గా ప్రకటించాడు. స్కోరు బోర్డులో కూడా 4 పరుగులే కౌంట్ చేశారు. ఆ సమయంలో లక్నో బ్యాటర్లు గానీ, మేనేజ్మెంట్ గానీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఆ 2 పరుగుల వల్లే టీం ఓటమి
అంపైర్ చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల లక్నోకు నేరుగా 2 పరుగులు నష్టం వాటిల్లింది. మ్యాచ్ చివరలో అదే పెద్ద మైనస్ అయ్యింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు సరిగ్గా కోల్‌కతా స్కోరుకు సమానమై మ్యాచ్ టై అయ్యింది. ఒకవేళ ఆ 12వ ఓవర్లో అంపైర్ సిక్సర్ ఇచ్చి ఉంటే, లక్నో మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించేది. మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లేదే కాదు. కానీ అదృష్టం కలిసి రాక సూపర్ ఓవర్లో కేకేఆర్ చేతిలో లక్నో చిత్తయ్యింది.
11.1 over – Kartik Tyagi to Pant… that was CLEARLY a six, but somehow the umpire calls it four 👀
Runs get recorded as 4, match goes to a Super Over…Script writers working overtime or what? 🤨 pic.twitter.com/mdv5RJuJJh
— Noah (@Noahasthetic) April 27, 2026
సోషల్ మీడియాలో విమర్శలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ అంపైర్లపై విరుచుకుపడుతున్నారు. “కోట్ల రూపాయలు వెచ్చించి టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎలా జరుగుతాయి?” అని ప్రశ్నిస్తున్నారు. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గెలిచే మ్యాచ్ అంపైర్ల నిర్లక్ష్యం వల్ల చేజారిపోవడంతో లక్నో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
సూపర్ ఓవర్ డ్రామా
మ్యాచ్ టై అయిన తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుతంగా రాణించింది. లక్నో బ్యాటర్లను కట్టడి చేయడమే కాకుండా, లక్ష్యాన్ని సులభంగా ఛేదించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. ఏది ఏమైనా, ఈ మ్యాచ్ ఫలితం కంటే అంపైర్ చేసిన ఆ తప్పుడు నిర్ణయమే ఇప్పుడు ఐపీఎల్ 2026లో హాట్ టాపిక్ గా మారింది. ఇకనైనా థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇలాంటి పొరపాట్లను సరిదిద్దాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి