Kashi Yatra Hindu Beliefs: పరమ శివుని నివాస స్థలంగా, మోక్ష ప్రదాయినిగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరం కాశీ. వారణాసి, బనారస్ అనే పేర్లతో కూడా పిలువబడే ఈ క్షేత్రం హిందువుల ఆధ్యాత్మిక జీవితంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ కొలువైన కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలని ప్రతి శివభక్తుడు కోరుకుంటాడు. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు కాలభైరవ ఆలయం, సంకట మోచన్ హనుమాన్ ఆలయం, దుర్గాదేవి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.
అలాగే దశాశ్వమేధ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వంటి పవిత్ర ఘాట్లు కాశీ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఋగ్వేదంలోనూ కాశీ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని, ఇక్కడ మరణించిన వారికి మోక్షం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
కాశీ యాత్రలో విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం బాబా కాలభైరవుడిని దర్శించుకోవడం ఎంతో ముఖ్యమని సంప్రదాయం చెబుతుంది. అయితే కాశీ యాత్ర ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు నాలుగు పవిత్ర వస్తువులను తప్పనిసరిగా తీసుకురావాలనే నమ్మకం కూడా ఉంది. అవేంటో తెలుసుకుందాం.
1. అన్నపూర్ణ మాత అక్షతలు
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుంది. అన్నపూర్ణాదేవిని అన్నదాతగా, సమస్త జీవులకు ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. అమ్మవారి అనుగ్రహంతో కాశీలో ఎవరూ ఆకలితో ఉండరని భక్తుల విశ్వాసం. అందుకే ఆలయంలో లభించే అక్షతలు లేదా బియ్యాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్తారు. వాటిని ఇంట్లో భద్రపరుచుకుంటే అన్నపూర్ణ మాత ఆశీస్సులతో అన్నవస్త్రాలకు లోటు ఉండదని, కుటుంబంలో సుఖసంతోషాలు, సమృద్ధి కలుగుతాయని నమ్ముతారు.
2. కాలభైరవుడి నల్లదారం
కాశీ క్షేత్రపాలకుడిగా బాబా కాలభైరవుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత కాలభైరవుడిని దర్శించుకోవడం యాత్రలో ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు. కాలభైరవ ఆలయంలో లభించే నల్లదారాన్ని రక్షాసూత్రంగా భక్తులు భావిస్తారు. ఈ దారాన్ని చేతికి లేదా మెడకు ధరించడం వల్ల దిష్టి, ప్రతికూల శక్తులు, ఆపదల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు.
3. సంకట దేవి సింధూరం
కాశీలోని సంకట దేవి ఆలయం భక్తులకు ఎంతో విశిష్టమైనది. జీవితంలోని కష్టాలు, బాధలు, భయాలు తొలగించాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికి సమర్పించిన సింధూరాన్ని మహిళలు ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఈ సింధూరాన్ని ధరించడం వల్ల సౌభాగ్యం, భర్తకు దీర్ఘాయుష్షు, కుటుంబానికి అమ్మవారి రక్షణ లభిస్తాయని నమ్ముతారు.
4. సంకట మోచన్ హనుమంతుడి ప్రసాదం
వారణాసిలోని సంకట మోచన్ హనుమాన్ ఆలయం అత్యంత ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి క్షేత్రాలలో ఒకటి. గోస్వామి తులసీదాస్ ఈ ఆలయాన్ని స్థాపించారని ప్రతీతి. ఇక్కడ హనుమంతుడిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు పంచిపెట్టడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగి, ధైర్యం, మనశ్శాంతి, స్వామివారి అనుగ్రహం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
కాశీ యాత్ర అంటే కేవలం దేవాలయాల సందర్శన మాత్రమే కాదు.. అది భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతుల సమ్మేళనం. ఈ నాలుగు పవిత్ర ప్రసాదాలను ఇంటికి తీసుకురావడం వెనుక తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలు దాగి ఉన్నాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ, భక్తిశ్రద్ధలతో కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం ప్రతి శివభక్తుడికి ఒక మధురమైన అనుభూతి.
(Disclaimer: ఈ కథనంలోని సమాచారం హిందూ సంప్రదాయాలు, మత విశ్వాసాలు, భక్తుల ఆచారాల ఆధారంగా అందించబడింది. ఈ పవిత్ర వస్తువుల వల్ల శుభఫలితాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.)
మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.