Jasprit Bumrah : వరుసగా 5 మ్యాచులు.. సున్నా వికెట్లు.. ఇంతకీ బుమ్రాకు ఏమైంది? పఠాన్ షాకింగ్ అనాలిసిస్

Jasprit Bumrah : వరుసగా 5 మ్యాచులు.. సున్నా వికెట్లు.. ఇంతకీ బుమ్రాకు ఏమైంది?  పఠాన్ షాకింగ్ అనాలిసిస్


Jasprit Bumrah : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కూడా అంతే ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న బుమ్రా, ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల నుంచి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ 41 పరుగులు ఇచ్చి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. బుమ్రా ఎందుకు విఫలమవుతున్నారు? దీనికి గల కారణాలను మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించారు.

బుమ్రా వైఫల్యంపై ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆసక్తికరమైన గణాంకాలను బయటపెట్టారు. ఈ సీజన్‌లో బుమ్రా తన సగటు వేగాన్ని 130 కి.మీ.లకు తగ్గించారని పఠాన్ పేర్కొన్నారు. “బుమ్రా ఈ సీజన్‌లో దాదాపు 44 శాతం స్లోయర్ డెలివరీలే వేస్తున్నారు. అంటే ప్రతి రెండు బంతుల్లో ఒకటి నెమ్మదిగా వస్తోంది. దీనివల్ల బ్యాటర్లు సులువుగా టైమింగ్ చేస్తున్నారు. బుమ్రా తన అసలు వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది” అని పఠాన్ అభిప్రాయపడ్డారు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు బుమ్రా 19 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. పైగా 8.63 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుంటున్నారు. సాధారణంగా 6 లేదా 7 ఎకానమీ ఉండే బుమ్రా, ఈసారి బ్యాటర్లకు చిక్కుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (66) బుమ్రా బౌలింగ్ ను ఏమాత్రం భయం లేకుండా ఎదుర్కోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

బుమ్రా తన స్లోయర్ బంతుల శాతాన్ని 44 శాతం నుంచి 30-35 శాతానికి తగ్గించాలని పఠాన్ సూచించారు. “ఎప్పుడైతే మీరు ఎక్కువ ఫాస్ట్ డెలివరీల మధ్యలో అప్పుడప్పుడు స్లో బాల్ వేస్తారో, అది వికెట్ తీసే అవకాశం ఉంటుంది. కానీ అన్ని బంతులూ స్లోగా వేస్తే బ్యాటర్లు అలవాటు పడిపోతారు. బుమ్రాకు కోచింగ్ అవసరం లేదు, కానీ తన పాత వేగాన్ని, సీమ్ అండ్ స్వింగ్‌ను నమ్ముకుంటే వికెట్లు వాటంతట అవే వస్తాయి” అని ఇర్ఫాన్ వివరించారు.

బుమ్రా విఫలమవ్వడం ముంబై ఇండియన్స్ జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయిన ఎంఐ, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బుమ్రా నుంచి సరైన మద్దతు లభించకపోవడం, బౌలింగ్ యూనిట్ అంతా గందరగోళంగా ఉండటం జట్టును పతనం అంచుకు తీసుకెళ్తోంది. ముంబై ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే బుమ్రా తన పాత యార్కర్లతో వికెట్లు పడగొట్టాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *