Headlines

IIT కాన్పూర్‌లో మెడికల్‌ కోర్సులు షురూ.. MBBS కాదండోయ్‌! అంతకుమించి..


సాధారణంగా ఐఐటీ క్యాంపస్ అంటే ఇంజినీరింగ్ విద్యార్థులు, హాస్టల్ సందడి, ల్యాబ్‌లు, సైకిళ్ల శబ్దాలతో కళకళలాడే వాతావరణం గుర్తుకొస్తుంది. అయితే ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్‌లో ఆ దృశ్యం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. గంగా నది వైపు విస్తరించిన క్యాంపస్‌లో భారీ ఆస్పత్రి నిర్మాణం దశలవారీగా కొనసాగుతోంది. మాన్సూన్ తర్వాత ఆకాశం మెల్లగా నిర్మలమవుతున్న వేళ.. క్రేన్లు, నిర్మాణ కార్మికులతో ఆ ప్రాంతం కొత్త రూపు సంతరించుకుంటోంది. త్వరలోనే ఈ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందనుంది. అంతేకాదు.. దేశంలో ఇప్పటివరకు పెద్దగా కనిపించని ఓ భిన్నమైన వైద్య విద్యా విధానానికి ఐఐటీ కాన్పూర్ వేదిక కానుంది.

ముందుగా MBBS కాదు.. ఆ స్పెషలైజేషన్ కోర్సులే

ఐఐటీ కాన్పూర్ వైద్య డిగ్రీలను అందించేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. మొదటగా MBBS కోర్సును ప్రారంభించబోవడం లేదు. MBBS ప్రారంభానికి మరో మూడు నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని గ్యాంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ అనిల్ కె. లాల్వానీ వెల్లడించారు. మొదటి దశలో ప్రాథమిక వైద్య విద్య తర్వాత చేసే ఉన్నత వైద్య కోర్సులు, అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సులైన DM (Doctorate of Medicine), MCh (Master of Chirurgiae)లను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అంటే.. సాధారణ వైద్యుడి నుంచి కార్డియాలజిస్ట్, న్యూరోసర్జన్ వంటి స్పెషలిస్టులుగా ఎదగడానికి అవసరమైన ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వైద్యం-ఇంజినీరింగ్ కలయికలో ట్రాన్స్‌డిసిప్లినరీ పరిశోధన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని ఐఐటీ కాన్పూర్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి



500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

గ్యాంగ్వాల్ స్కూల్‌కు సమీపంలో నిర్మిస్తున్న యాదుపతి సింఘానియా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మొత్తం 500 పడకలు ఉండనున్నాయి. ఈ ఆస్పత్రిని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించి, 2027 మార్చి నాటికి తొలి రోగికి చికిత్స అందించాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని డీన్ లాల్వానీ తెలిపారు. దీనికి సమీపంలో 50 పడకల క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ కూడా నిర్మిస్తున్నారు. ఆస్పత్రి, పరిశోధన ప్రయోగశాలలు దగ్గరగా ఉండటంతో.. రోగికి ఎదురయ్యే సమస్యపై వైద్యులు పరిశీలన చేయడంతో పాటు, దానికి ఇంజినీరింగ్ పరిష్కారాలను కూడా వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఐఐటీ కాన్పూర్‌కు ప్రారంభ దశలో 60 మంది కొత్త ఫ్యాకల్టీ సభ్యులను నియమించుకునేందుకు అనుమతి లభించింది. వీరిలో క్లినికల్ మెడిసిన్‌తో పాటు వైద్య పరిశోధన రంగాలకు చెందిన నిపుణులు ఉండనున్నారు. వైద్యం, ఇంజినీరింగ్ రంగాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా కొత్త తరహా వైద్య నిపుణులను తీర్చిదిద్దాలన్నది సంస్థ లక్ష్యంగా కనిపిస్తోంది.

తన ప్రత్యేక రంగానికే ప్రాధాన్యం ఇవ్వని డీన్

ప్రొఫెసర్ అనిల్ కె. లాల్వానీ వైద్య రంగంలో చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్యంలో (Otolaryngology) నిపుణుడు. కొలంబియా యూనివర్సిటీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఒటోలారింగాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వినికిడి లోపాల చికిత్స, జీన్ థెరపీ, కోక్లియర్ ఇంప్లాంట్ వంటి అంశాలపై ఆయన పరిశోధనలు చేశారు. ఈ అనుభవం కారణంగా ఐఐటీ కాన్పూర్‌లో కూడా తన ప్రత్యేక రంగమైన వినికిడి వైద్యాన్నే ప్రధాన ప్రాజెక్టుగా మార్చాలని కొందరు సూచించినప్పటికీ.. ఆయన అందుకు అంగీకరించలేదు. కొత్త వైద్య పాఠశాల ఒక వ్యక్తి ప్రత్యేక ఆసక్తికి ప్రతీకగా కాకుండా.. విస్తృత వైద్య, పరిశోధన రంగాలకు వేదికగా ఉండాలన్నదే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఐఐటీ కాన్పూర్ మాత్రమే కాదు.. దేశంలోని మరికొన్ని ఐఐటీలు కూడా వైద్య విద్య, పరిశోధన వైపు అడుగులు వేస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ కూడా వైద్య విద్యకు సంబంధించిన ప్రణాళికలపై ముందుకు సాగుతోంది. ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసింది. భవిష్యత్తులో మరిన్ని ఐఐటీలు తమ సొంత వైద్య విద్యా నమూనాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ లాల్వానీ అభిప్రాయపడ్డారు.

వైద్యం-ఇంజినీరింగ్ కలయికే భవిష్యత్తు?

ఐఐటీ కాన్పూర్ రూపొందిస్తున్న నమూనాలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం వైద్యం, ఇంజినీరింగ్, పరిశోధనలను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం. ఆస్పత్రిలో ఎదురయ్యే వైద్య సమస్యలకు ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలు కనుగొనడం.. అదే సమయంలో కొత్త వైద్య ఆవిష్కరణలను క్లినికల్ స్థాయిలో పరీక్షించడం ఈ విధానంలో కీలకంగా ఉండనుంది. ముందుగా స్పెషలిస్టులను, ఆ తర్వాత MBBS విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఐఐటీ కాన్పూర్ ప్రణాళిక.. ఇండియన్‌ మెడికల్‌ విద్యలో ఓ కొత్త నమూనాకు దారితీస్తుందా? అన్నది రాబోయే సంవత్సరాల్లో తేలనుంది. అయితే 2027 మార్చిలో తొలి రోగికి చికిత్స అందించే లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న ఆ ఆస్పత్రి.. ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో వైద్యం, ఇంజినీరింగ్ మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *