
ICC T20I Rankings 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళ స్టార్ బ్యాటర్ సంజు శామ్సన్ అద్భుతమైన ఫామ్‌తో ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేశాడు. వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు, ఏకంగా 18 స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సంజు 80.25 సగటుతో 321 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.
ఇషాన్ కిషన్ జోరు.. టాప్‌లో అభిషేక్
మరోవైపు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇషాన్ 871 రేటింగ్ పాయింట్లతో దూసుకుపోతున్నాడు. ఇక టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. వరల్డ్ కప్ ఆద్యంతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్, ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. భారత కుర్రాళ్లు మొదటి రెండు స్థానాల్లో ఉండటం క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్తే.
సూర్య, తిలక్ వర్మలకు నిరాశ
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ సంచలనం తిలక్ వర్మలకు మాత్రం ఈసారి ర్యాంకింగ్స్‌లో చుక్కెదురైంది. వరల్డ్ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్, రెండు స్థానాలు దిగజారి 9వ ర్యాంకుకు పడిపోయాడు. ప్రస్తుతం సూర్య రేటింగ్ 722గా ఉంది. అలాగే తిలక్ వర్మ కూడా కొన్ని స్థానాలు నష్టపోయాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా టాప్-10 బ్యాటర్లలో ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం.
ప్రపంచ టాప్-5 బ్యాటర్లు వీరే
ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం అభిషేక్ శర్మ (భారత్) మొదటి స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ (భారత్) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఒక స్థానాన్ని కోల్పోయి 848 రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ నాలుగో స్థానానికి పరిమితం కాగా, శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ విజయంతో టీమిండియా ప్లేయర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..