Headlines

Hyderabad: సినిమాకు వెళితే 22 నిమిషాల యాడ్స్.. థియేటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..


వినోదం, మానసిక ఉల్లాసం కోసం సినిమాలకు వెళ్తుంటారు.. సినిమాలు మనల్ని కాసేపు రోజువారీ ఒత్తిడి నుంచి దూరం చేసి, ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. అంతేకాకుండా.. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి వెళ్లడం వల్ల బంధాలు కూడా బలపడతాయి. అందుకే.. ఎంత ఖర్చయినా.. ఎంత దూరం ఉన్నా.. థియేటర్‌లో సినిమాలను చూస్తుంటారు. అలా.. సినిమా థియేటర్ కు వెళ్లిన ఓ ప్రేక్షకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఓ థియేటర్‌లో సినిమా చూడటానికి వెళితే 22 నిమిషాలు యాడ్స్ ప్లే చేయడంతో కంగుతిన్న ఓ ఆడియన్.. కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళారు.. దీంతో కోర్టు భారీ ఫైన్ విధించింది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని ఓ థియేటర్ లో జరిగింది. సినిమా ప్రదర్శన సమయం దాటినా వాణిజ్య ప్రకటనలు (Ads) టెలికాస్ట్ చేస్తూ ప్రేక్షకుల సమయాన్ని వృథా చేసినందుకు గాను హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ (Consumer Forum) భారీ షాక్ ఇచ్చింది. ప్రదర్శనను 22 నిమిషాలు ఆలస్యం చేసినందుకు రూ.75,000 చెల్లించాలని ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..

జూన్ 20, 2025న ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా చూడటానికి ఒక వ్యక్తి.. రాత్రి 10:35 గంటల షోకు రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. స్నిహితుడితో కలిసి థియేటర్ కు వెళ్లాడు.. నిర్ణీత సమయానికి థియేటర్‌లో కూర్చున్నప్పటికీ, రాత్రి 10:52 వరకు వాణిజ్య ప్రకటనలు, ప్రమోషనల్ ట్రైలర్లు వేస్తూనే ఉన్నారు. దాంతో సినిమా ప్రారంభం దాదాపు 22 నిమిషాలు ఆలస్యమైంది. సినిమా పూర్తి అయ్యి ఇంటికి వెళ్లే సరికి రాత్రి మూడు గంటలు అయ్యిందని, తన సమయాన్ని థియేటర్ యాజమాన్యం వృథా చేసిందని పేర్కొన్నాడు ప్రేక్షకుడు..

కోర్టును ఆశ్రయించిన ప్రేక్షకుడు:

నిరంతరం ప్రకటనలు వేస్తూ కస్టమర్ల విలువైన సమయాన్ని వృథా చేయడం సేవా లోపమేనని (Deficiency in service), ఇది తన సమయంపై కూడా ప్రభావం చూపిందని సదరు ప్రేక్షకుడు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అయితే.. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్.. తుది తీర్పును వెలువరించింది. థియేటర్ యాజమాన్యం తమ వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రేక్షకులు లోపలికి వచ్చాక కూడా వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించిందని కమిషన్ స్పష్టం చేసింది. దీనిని అనుచిత వ్యాపార ధోరణి (Unfair Trade Practice) గా పరిగణిస్తూ తీర్పు వెల్లడించింది. కమర్షియల్ యాడ్స్, ట్రైలర్లు, ప్రజా సంక్షేమ ప్రకటనలను ప్రదర్శించడం తమకు రాజ్యాంగం ద్వారా లభించిన వ్యాపార హక్కు అని థియేటర్ తరఫు న్యాయవాదులు వాదించినా.. ఈ ధోరణి కరెక్ట్ కాదని.. ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయడం తగదంటూ తీర్పునిచ్చింది.

బాధిత వినియోగదారుడికి నష్టపరిహారంగా 20వేలు చెల్లించాలని.. లీగల్ కాస్ట్ (కోర్టు ఖర్చులు) కింద కస్టమర్‌కు రూ. 5వేలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిక్షాత్మక చర్యగా జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి (District Consumer Welfare Fund) రూ.50వేలు జమ చేయాలని ఆదేశించింది.

అంతకుముందు.. థియేటర్ లో యాడ్స్ విషయంపై బెంగళూరులో కూడా ఓ ప్రేక్షకుడు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లగా మల్టీప్లెక్స్‌కు ఫైన్ పడింది. అప్పటి నుంచి యాడ్ ప్లే చేసే సమయాన్ని కాస్త తగ్గించారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మరో థియేటర్‌కు కోర్టు ఫైన్ విధించడం సంచలనంగా మారింది. సినిమా టికెట్ సమయం కేటాయించాక, అంతకుమించి అడ్వర్టైజ్మెంట్లు ప్రదర్శించి ప్రేక్షకుల సమయాన్ని వృథా చేసే థియేటర్ల తీరుపై ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *