స్వర్ణాంధ్రప్రదేశ్.. పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయిన గోల్డ్ మైన్స్… ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాది వేయబోతోంది. ఒకప్పుడు మూతపడిన గనులు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్టప్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా నిద్రిస్తున్న సంపద, ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును మార్చే అవకాశాల కథ. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, అభివృద్ధి, ఇలా ఎన్నో ఆశలకు అంకురార్పణ జరగనుంది. మరి భూమిలో దాగున్న బంగారం.. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే మార్చేస్తుందా..? రాయలసీమ నిజంగానే దేశానికి కొత్త ‘గోల్డెన్ బెల్ట్’గా అవతరించబోతోందా..?
మొన్ననే సీమలో ఓ గోల్డ్ బెల్ట్ ప్రారంభమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి తర్వాత, రాష్ట్రంలోని ఇతర బంగారు గనులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శ్రీ సత్యసాయి జిల్లాలోనిరామగిరి గోల్డ్ మైన్స్‌ను పరిశీలించింది ఏపీ సర్కార్. సుమారు పాతికేళ్ళు నిశ్శబ్దంగా ఉన్న రామగిరి కొండల్లో మళ్ళీ పసిడి చప్పుడు వినిపించబోతుంది. బ్రిటిష్ కాలంలోనే రామగిరి కొండల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని తవ్వకాలు జరిపారు. తర్వాత 1972లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బంగారు తవ్వకాలు ప్రారంభించింది. 1982 నుంచి 2002 వరకు రామగిరి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి జరిగింది. అయితే అప్పట్లో శుద్ధి చేయగా వచ్చిన బంగారం కంటే… బంగారాన్ని ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో… భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. 2002 తర్వాత భారత్ గోల్డ్ మైన్స్ మూతపడింది. మళ్లీ ఇప్పుడు మూతపడ్డ రామగిరి గోల్డ్ మైన్స్ తిరిగి తెరుచుకోబోతోంది.
- రామగిరిలో టన్ను ఖనిజానికి 4 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది
- రామగిరి ఉత్తర-దక్షిణ బ్లాక్‌లలో 2 వేల హెక్టార్లపై ఖనిజ అన్వేషణ జరుగుతోంది
- జవకులలో 5,560 హెక్టార్లలో A నుంచి F బ్లాక్‌ల వరకు ప్రతిపాదనలు
- బొక్సంపల్లిలో 1,740 హెక్టార్ల ఉత్తర-దక్షిణ బ్లాక్లపై ఫోకస్
- జొన్నగిరికంటే రామగిరిలో నిల్వలు ఎక్కువ ఉంటాయని అంచనా
గతంలో రామగిరి గనుల్లో భారత్ గోల్డ్ మైన్స్ తవ్వకాలు చేపట్టింది. అనంతరం ఖర్చులు పెరగడం, బంగారం ధరలు తక్కువగా ఉండటంతో తవ్వకాలను నిలిపివేశారు. 2018లో ఎన్ఎండీసీకి ఈ గనులు దక్కినా.. కోర్టు కేసులు, అనుమతుల జాప్యంతో సంస్థ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఈ గనులకు మళ్లీ ఈ-వేలం నిర్వహిస్తుండగా.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీఎండీసీ బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. గనులను దక్కించుకునేందుకు రూ.37 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించేందుకు ఏపీఎండీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బిడ్ దక్కితే.. ప్రైవేట్ భాగస్వామ్య సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి బంగారం తవ్వకాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
రామగిరితో పాటు చిగురుగుంట జవకుల, బొక్సంపల్లి ప్రాంతాల్లోనూ బంగారు ఖనిజ అన్వేషణ హక్కులను ఏపీఎండీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తెలంగాణలో సింగరేణికి, ఒడిశాలో రాష్ట్ర సంస్థలకు గనులు నేరుగా కేటాయించిన తరహాలోనే… ఏపీలోనూ అదే విధానం అమలు చేయాలని ప్రయత్నిస్తోంది.
చిగురుగుంటలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలు గుర్తించారు. సుమారు 12,500 కిలోల బంగారం వెలికితీయవచ్చని అంచనా వేశారు. టన్ను ఖనిజానికి సగటున 5.64 గ్రాముల బంగారం లభించే అవకాశం. చిగురుగుంట-బి.సానత్తం బంగారు గనులపై రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గురి పెట్టింది.. రామగిరి, జవకుల, బొక్సంపల్లి బ్లాక్‌లనూ దక్కించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రామగిరి గోల్డ్ మైన్స్ ఏపీ సర్కార్ పరిశీలించింది. భారత్ గోల్డ్ మైన్స్ గడువు 2002 కి పూర్తి అయింది.416 ఎకరాల్లో రామగిరి గోల్డ్ మైన్ ఉంది. ప్పటికే రామగిరి గోల్డ్ మైన్స్ పై సర్వేలు పూర్తి అయ్యాయి త్వరలో టెండర్లు పిలిచి… మైనింగ్ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్… ఇప్పుడు జొన్నగిరి, రామగిరి, చిగురుగుంట పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించే రోజులు వస్తాయంటున్నారు పాలకులు. దశాబ్దాలుగా భూమి అడుగున నిద్రిస్తున్న బంగారు సంపద… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త బలంగా మారబోతోంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే… వేలాది మందికి ఉపాధి… వందల కోట్ల పెట్టుబడులు… ప్రభుత్వానికి భారీ ఆదాయం… రాయలసీమకు కొత్త పారిశ్రామిక రూపం తీసుకురావచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..