ప్రపంచంలో బంగారు నగరం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు దుబాయ్. పర్యాటకం కోసం వెళ్లినా, పని మీద వెళ్లినా అక్కడికి వెళ్లిన భారతీయులు కచ్చితంగా కొనే వస్తువు బంగారం. అసలు భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధర ఎందుకు తక్కువగా ఉంటుంది? అక్కడి నుండి ఎంత బంగారం తీసుకురావాలి? అనే విషయాలపై చాలా అవగాహన ఉండదు. దుబాయ్‌లో బంగారం చౌకగా ఉండటానికి కేవలం ధర మాత్రమే కాదు, అక్కడి వ్యాపార వ్యవస్థ కూడా ప్రధాన కారణం. మన దేశంలో బంగారంపై దిగుమతి సుంకం, ఇతర పన్నులు ఎక్కువగా ఉంటాయి. దుబాయ్‌లో పన్ను రాయితీలు ఉండటంతో బేస్ ధర తక్కువగా ఉంటుంది. ఇండియాలో ఆభరణాల తయారీ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దుబాయ్‌లో పోటీ ఎక్కువ కావడంతో వ్యాపారులు తక్కువ లాభానికే ఆభరణాలను విక్రయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా ఇక్కడ రేట్లు నిర్ణయించబడతాయి. మార్కెట్‌లో పారదర్శకత ఎక్కువగా ఉండటం వినియోగదారులకు కలిసొచ్చే అంశం.
తాజా ధరల వివరాలు
ప్రస్తుత అంతర్జాతీయ హెచ్చుతగ్గుల ప్రకారం దుబాయ్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్లు: 565 AED (10 గ్రాములకు 5,650 AED)
22 క్యారెట్లు: 524 AED (10 గ్రాములకు 5,240 AED)
18 క్యారెట్లు: 430 AED (10 గ్రాములకు 4300 AED)
ఇండియాకు ఎంత బంగారం తీసుకురావచ్చు..?
దుబాయ్‌లో ధర తక్కువ కదా అని ఎంత పడితే అంత తీసుకువస్తే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ చిక్కులు తప్పవు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కింది పరిమితులను గుర్తుంచుకోవాలి:
పురుషులు: 20 గ్రాముల వరకు (రూ. 50,000 విలువ మించకూడదు) డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు.
మహిళలు: 40 గ్రాముల వరకు (రూ. లక్ష విలువ మించకూడదు) పన్ను లేకుండా తీసుకురావచ్చు.
ఈ పరిమితి దాటిన ప్రతి గ్రాముకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు భారీగా బంగారం తీసుకువస్తే, ఆ పన్నులతో కలిపి చూస్తే ఇండియా ధరతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువే పడవచ్చు.
ఆభరణాలు మాత్రమే కాదు.. పెట్టుబడిగా కూడా..
డిజిటల్ యుగంలో దుబాయ్ బంగారం ఇక కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. పెట్టుబడిదారులు బంగారు కడ్డీలు, నాణేలు కొనడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కారకాలు అంటే డాలర్ బలం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దుబాయ్‌లో బంగారం కొనడం అనేది కేవలం ధర కోసమే కాదు, అక్కడి నాణ్యత, డిజైన్ల కోసం కూడా.. అయితే, పక్కా ప్లానింగ్ లేకుండా కస్టమ్స్ నిబంధనలు తెలియకుండా ఎక్కువ మొత్తంలో బంగారం కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి నిబంధనల మేరకు కొనుగోలు చేస్తేనే దుబాయ్ గోల్డ్ మీకు నిజమైన లాభాన్ని ఇస్తుంది.