Headlines

Ganga Aarti: విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి.. లండన్ థేమ్స్ నది వద్ద తొలి గంగా హారతి


Ganga Aarti: విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి.. లండన్ థేమ్స్ నది వద్ద తొలి గంగా హారతి

లండన్‌ వీధుల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.. తొలిసారి లండన్‌లోని థేమ్స్ నది వద్ద గంగాహారతి కార్యక్రమం జరిగింది. భారతదేశంలోని గంగా నది వద్ద జరిగే ప్రపంచ ప్రసిద్ధ హారతి స్ఫూర్తితో.. తమ సంస్థ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘చిన్మయ మిషన్ UK’, వార్షిక ‘టోటల్లీ థేమ్స్’ ఫెస్టివల్‌తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్మయ మిషన్ UK రెసిడెంట్ టీచర్ బ్రహ్మచారిణి ప్రియ చైతన్య మాట్లాడుతూ.. నదితో పాటు ప్రకృతికి, జీవరాశిని కాపాడే పంచభూతాలకు కృతజ్ఞతలు తెలుపుతూ దీపాలను సమర్పించేందుకు తరతరాలుగా ప్రజలు గంగా తీరంలో ఈ హారతులు ఇస్తున్నారని తెలిపారు. థేమ్స్ నదిపై జరిగిన గంగా హారతి కూడా అదే స్ఫూర్తిని కలిగి ఉందన్నారు.

తమ వ్యవస్థాపకులైన స్వామి చిన్మయానంద, హిందూ మతంలోని గొప్ప తాత్విక సంప్రదాయాలలో ఒకటైన వేదాంత జ్ఞానాన్ని హిమాలయాల నుండి ప్రజల రోజువారీ జీవితంలోకి తీసుకొచ్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఈ 75 సంవత్సరాల వార్షిక వేడుక ఆయన వారసత్వానికి, జ్ఞానానికి, సేవలకు కృతజ్ఞతగా జరుగుతున్నట్టు చెప్పారు. ఈ వేడుక హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా, ప్రాణదాతయైన గంగామాత పట్ల కృతజ్ఞతా వ్యక్తీకరణ అని ఆమె తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట:
సాధారణంగా గంగా హారతిని నీటిలో నిలబడి జరుపుతారు. కానీ థేమ్స్ నది దగ్గర జరిగిన ఈ హారతి పూర్తిగా నేల మీదే జరిగింది. సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవిస్తూనే, పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో వేడుకకు సంబంధించిన ఎలాంటి పూజా వస్తువులను థేమ్స్ నదిలో వదలలేదు. పర్యావరణాన్ని పరిరక్షించేలా ఈ కార్యక్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

గ్రీన్‌విచ్‌లోని చారిత్రాత్మక ‘ఓల్డ్ రాయల్ నావల్ కాలేజ్’ నేపథ్యంలో సంగీతం, మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమం.. UK వ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలను, కమ్యూనిటీలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. సహజ ప్రపంచాన్ని తేలికగా తీసుకోవద్దనే విషయాన్ని ఈ హారతి మనకు గుర్తుచేస్తుందని.. ప్రకృతి పట్ల కృతజ్ఞత కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని బాధ్యతగా చూసుకోవడం ద్వారా కూడా వ్యక్తపరచాలని వారు పిలుపునిచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *