Headlines

Sabarimala Prasadam: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం ఇంటికే డెలివరీ


Sabarimala Aravana Prasadam: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఇండియా పోస్ట్ తీపి కబురు అందించింది. ఇకపై శబరిమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు అక్కడి ప్రసాదాలను తమ ఇళ్లకే తెప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందిన అరవణ పాయసంతో పాటు ఇతర ప్రసాదాలను కూడా దేశంలోని ఏ ప్రాంతానికైనా పోస్టు ద్వారా పంపించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ఇండియా పోస్ట్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB)తో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

24 గంటల పాటు ప్రత్యేక పార్సిల్ కౌంటర్

ఈ ఏడాది మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శబరిమల సన్నిధానంలో ప్రత్యేకంగా ‘స్వామి ప్రసాదం’ పేరుతో పార్సిల్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్ 24 గంటల పాటు పనిచేయనుంది. దేవస్వం బోర్డు నిర్వహించే అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీ కౌంటర్ల పక్కనే ఈ ప్రత్యేక కేంద్రం అందుబాటులో ఉంటుంది. భక్తులు అక్కడ తమకు కావాల్సిన ప్రసాదాలను బుక్ చేసుకుంటే ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ పార్సిల్ సేవ ద్వారా నేరుగా ఇంటి చిరునామాకు పంపిస్తారు. అరవణ, విభూది, పసుపు, కుంకుమ, ఆడియ శిష్టం నెయ్యి, అష్టోత్తరార్చన ప్రసాదాలను ఈ సేవ ద్వారా పొందవచ్చు.

ప్రసాదాల ధరలు ఎంతంటే?

  • అరవణ పాయసం 250 మిల్లీలీటర్ల టిన్‌లలో లభిస్తుంది. ఇతర ప్రసాదాలతో కలిపి వివిధ కాంబినేషన్లలో పార్సిళ్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
  • ఒక టిన్ అరవణ: విభూది, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తరార్చనతో కలిపి ₹320. పోస్టల్ ఛార్జీలు, ప్యాకింగ్ ఖర్చు ₹200. మొత్తం ₹520.
  • నాలుగు టిన్ల అరవణ: ఇతర ప్రసాదాలతో కలిపి మొత్తం ₹960. ఇందులో పోస్టల్ ఛార్జీలు ₹340.
  • 10 టిన్ల అరవణ: ఇతర ప్రసాదాలతో కలిపి మొత్తం ₹1,760. ఇందులో పోస్టల్ ఛార్జీలు, ప్యాకింగ్ ఖర్చు ₹530.

దేశవ్యాప్తంగా భక్తులకు అందుబాటులో..

ఈ సదుపాయం శబరిమలకే పరిమితం కాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని భక్తులు కూడా తమ సమీప పోస్టాఫీసు ద్వారా స్వామివారి ప్రసాదాలను బుక్ చేసుకుని పొందవచ్చు. భారీ రద్దీ సమయంలో భక్తులు ప్రసాదాలను తమ వెంట తీసుకెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాటు ఉపయోగపడనుంది.

ఇవి కూడా చదవండి



ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్, కేరళ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది మండల సీజన్ కోసం అయ్యప్ప ఆలయం తెరుచుకునే సమయంలో, వచ్చే వారం నుంచి ఈ ప్రత్యేక పార్సిల్ బుకింగ్ కేంద్రం ప్రారంభం కానుంది. దీంతో అయ్యప్ప భక్తులు స్వామివారి ప్రసాదాలను తమ ఇళ్ల వద్దే పొందే అవకాశం కలగనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *