Headlines

Bigg Boss : హగ్గులు, కిస్సులు, గొడవలు.. ఇంత జరుగుతున్నా బిగ్ బాస్ హోస్ట్ గంగూలీ మౌనం వెనుక కారణం ఇదే


Bigg Boss : ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ బంగ్లా ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. షో లోపల జరుగుతున్న పరిణామాలు రోజూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవల ఒక టాస్క్ సందర్భంగా కంటెస్టెంట్లు నందిని, సృజల మధ్య తీవ్ర ఘర్షణ జరగడం, ఈ గొడవలో సృజలకు గాయాలు కావడం పెద్ద కలకలం రేపింది. ఆ తర్వాత నందినిని రాజ్‌వీర్ హగ్‌ చేసుకుని కిస్ చేయడం వంటి సంఘటనలు మరింత దుమారం రేపాయి. ఈ అశ్లీల, హింసాత్మక ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. షోకి హోస్ట్ అండ్ జడ్జిగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇన్ని జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

నెటిజన్ల ప్రశ్నలకు సౌరవ్ గంగూలీ సాలిడ్ రిప్లై

ప్రేక్షకులు, నెటిజన్ల నుంచి వస్తున్న ఈ విమర్శలపై ఎట్టకేలకు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న ప్రతి ఒక్క పరిణామం తన కంట పడుతోందని స్పష్టం చేశారు. అయితే వెంటనే అందరినీ అరిచి గద్దించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పోటీదారులు తమ నిజమైన స్వభావాన్ని బయటపెట్టడానికి, తమను తాము నిరూపించుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి తాను జోక్యం చేసుకోకుండా కేవలం పరిస్థితులను గమనిస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

సమయం వచ్చినప్పుడు నోరు విప్పుతా

సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో మాట్లాడుతూ.. “ఎవరినైనా తిట్టడం వల్ల లేదా బూతులు మాట్లాడడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయా?” అని ప్రశ్నించారు. షో ప్రారంభమై కేవలం మూడు వారాలే అయిందని, ఇప్పుడే కంటెస్టెంట్లు ఆ వాతావరణానికి అలవాటుపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలో మరికొన్ని కొత్త ముఖాలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా రానున్నాయని గుర్తుచేశారు. ఒక మంచి హోస్ట్ గా తన బాధ్యత ఆటను సజావుగా నడిపించడమే కానీ, ప్రతి చిన్న విషయానికి దాన్ని ఆపేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. బిగ్‌బాస్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేయాలని, ప్రతి ఒక్కరికీ తమను తాము ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని దాదా చెప్పుకొచ్చారు.

సరైన సమయం కోసం వెయిటింగ్

సౌరవ్ గంగూలీ ఇచ్చిన ఈ స్పష్టతతో బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న తంతుపై ఆయన పూర్తి నిఘా పెట్టారని స్పష్టమైంది. ప్రస్తుతానికి హౌస్‌లో కంటెస్టెంట్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న ఆయన, త్వరలోనే సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. రానున్న ఎపిసోడ్లలో దాదా రంగంలోకి దిగితే హౌస్ ఈక్వేషన్లు పూర్తిగా మారిపోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సౌరవ్ చేసిన ఈ వ్యాఖ్యలు టెలివిజన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *