Headlines

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం!

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం!


భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్.. సరిగ్గా మరో వారంలో ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభోత్సవ వేడుకకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అప్పటివరకు ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే.. విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు ఏడు అనుసంధాన రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని రోడ్ల పనులు పూర్తికాగా.. మరికొన్ని ముగింపు దశలో ఉన్నాయి. VMRDA చేపట్టిన ఐదు రోడ్లు దాదాపుగా పూర్తవగా.. జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ చేపట్టిన రోడ్లు వేగంగా కొనసాగుతున్నాయి. పూర్తయిన రోడ్లకు మార్కింగ్, సైన్ బోర్డులు, మైలురాళ్లు, బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్లు మొత్తం అందుబాటులోకి వస్తే.. భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణం ఊహించిన దాని కంటే వేగంగా సాగిపోతుంది.

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా భారీగా విమాన ప్రయాణికులు భోగాపురం వైపు క్యూ కట్టబోతున్నారు. అనకాపల్లి, గోదావరి జిల్లాల ప్రయాణికులు విశాఖ మీదుగానే ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వేగంగా వెళ్లేందుకు ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ చేపట్టింది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గం మీదుగా ఈ రోడ్ల విస్తరణ జరగగా.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానికంగా అడ్డంకులన్నీ పరిష్కరించి పనులు ముందుకు సాగేలా ప్రత్యేక చొరవ చూపారు.

ప్రస్తుతం ఈ రోడ్ల పనులు ముగింపు దశకు వచ్చాయి. VMRDA ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుకున్న సమయానికి తన పరిధిలోని రోడ్లను అందుబాటులోకి తెచ్చింది. పూర్తయిన రోడ్లు చూస్తుంటే ఎయిర్‌పోర్ట్ రన్ వే మాదిరిగా తలతల మెరిసిపోతున్నాయి!

ఇంతకీ ఏంటా ఏడు రోడ్లు. మొదటిది.. అడివివరం టు శొంఠ్యాం రోడ్డు. 8 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ రోడ్డుకు.. అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి. రోడ్డుకు లేన్ మార్కింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఈ రోడ్ పూర్తైతే.. 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 58 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ఇక రెండవది.. తిమ్మాపురం – మారికవలస రోడ్డు. 6 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ రోడ్డుకు సంబంధించిన పనులు నూటికి నూరు శాతం పూర్తయ్యాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయానికి ఈ రూట్‌లో కేవలం 45 నిమిషాల్లో వెళ్లవచ్చు.

మూడవది.. తాళ్లవలస – నేరెళ్లవలస రోడ్డు. 3.9 కిలోమీటర్ల పొడవు, 80 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ అనుసంధాన రోడ్డు పనులు కూడా వంద శాతం పూర్తై రాకపోకలకు సిద్ధంగా ఉంది. ఈ రూట్‌లో 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను కేవలం 36 నిమిషాల్లో చేరుకోవచ్చు.

నాలుగవది.. బోయపాలెం – కాపులుప్పాడ రోడ్డు. 3.1 కిలోమీటర్ల పొడవు, 80 అడుగుల వెడల్పు కలిగిన ఈ రోడ్డులో.. టీడీఆర్ సమస్య, వంతెన నిర్మాణం మినహా మిగిలిన 96 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ మార్గం మీదుగా 30.5 కిలోమీటర్ల దూరాన్ని 44 నిమిషాల్లో రీచ్ కావొచ్చు.

ఐదవది.. వేపగుంట – జుత్తాడ రోడ్డు. 6.35 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు పనులను జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తవ్వగా.. మరో రెండు నెలల్లో ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది.

ఆరవది.. వేపగుంట – పినగాడి రోడ్డు. 14 కిలోమీటర్ల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉన్న ఈ రోడ్డులో.. పినగాడి వైపు నుంచి 7 కిలోమీటర్ల వరకు నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అలాగే వేపగుంట కూడలి వరకు జీవీఎంసీ నిర్మిస్తున్న మరో 7.12 కిలోమీటర్ల రోడ్డు పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఈ నెలాఖరు నాటికి పూర్తి కానున్న ఈ 50 కిలోమీటర్ల సుదూర ప్రయాణాన్ని దాదాపు గంటలో పూర్తి చేయవచ్చు.

ఇక ఏడవది.. భీమిలి – దొరతోట రోడ్డు. 6.3 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో ఈమధ్యే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కల్వర్టులు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి.

ఈ ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు భీమిలి బీచ్‌రోడ్డులో కోస్టల్ కారిడార్ పనులు కూడా పూర్తయితే, విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. విమానాశ్రయం పూర్తిస్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభించే నాటికి ఈ రోడ్లన్నీ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారులన్నీ అక్షరాలా రన్‌వేలను తలపించేలా ముస్తాబవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *