Headlines

Asian Games 2026: 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత్.. ఏషియన్ గేమ్స్ మారథాన్‌లో రజతం


Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. భారత మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్ పురుషుల మారథాన్ విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ మారథాన్ ఈవెంట్‌లో గత 44 ఏళ్లుగా పతకం కోసం ఎదురుచూస్తున్న భారత దేశపు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ హోరాహోరీ పోటీలో సవాన్ బర్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దేశం గర్వపడేలా చేశారు.

జపాన్ రన్నర్‌తో పోటీ

సవాన్ బర్వాల్ ఈ రేసులో మొదటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా, నియంత్రణతో పరుగెత్తారు. రేసు మధ్యలో 10 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల దూరం వరకు ఆయన ముందంజలో ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారు. జపాన్‌కు చెందిన ఇచితాకా యమషిటా బంగారు పతకం సాధించగా, సవాన్ బర్వాల్ ఆయన కంటే కేవలం 48 సెకన్లు వెనుకబడి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నారు. బర్వాల్ కేవలం 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో (2:11:37) లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. చైనాకు చెందిన పేయౌ ఫెంగ్ కాంస్య పతకం సాధించగా, భారత్ తరఫున బరిలో దిగిన మరో రన్నర్ కార్తీక్ కర్కేర 19 మందిలో 17వ స్థానంలో నిలిచారు.

కొత్త రికార్డు సృష్టించిన సవాన్ బర్వాల్

సవాన్ బర్వాల్ జాతీయ రికార్డులను బద్దలు కొట్టడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన రొట్టెర్‌డ్యామ్ మారథాన్‌లో ఆయన శివనాథ్ సింగ్ యొక్క 48 ఏళ్ల పాత జాతీయ రికార్డును తిరగరాశారు. అప్పట్లో మారథాన్ అరంగేట్రంలోనే 2:11:58 టైమింగ్‌తో రికార్డు సృష్టించిన ఆయన, ఇప్పుడు నాగోయాలో దానిని మరింత మెరుగుపరచుకుని 2:11:37తో తన సొంత రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు. ఈ నిరంతర సాధన ఆయన ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

భారత్ కీర్తి కిరీటంలో మరో మైలురాయి

భారత క్రీడా చరిత్రలో ఏషియన్ గేమ్స్ మారథాన్‌లో పతకాలు సాధించింది అతి తక్కువ మందే. 1951 తొలి ఏషియన్ గేమ్స్‌లో చోటా సింగ్ స్వర్ణం, సూరత్ సింగ్ మాథూర్ కాంస్యం సాధించగా.. ఆ తర్వాత 1982 ఢిల్లీ గేమ్స్‌లో హోసూర్ కుక్కప్ప సీతారాం కాంస్యం గెలుచుకున్నారు. సరిగ్గా 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు సవాన్ బర్వాల్ ఈ జాబితాలో రజత పతకాన్ని చేర్చి నాల్గవ పతకవీరుడిగా నిలిచారు. ఈ పతకంతో ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల పట్టిక మరింత బలపడింది. అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు చూపుతున్న ప్రతిభ దేశం మొత్తానికి గర్వకారణంగా మారుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *