అపరాజిత మొక్కను పెంచడానికి పెద్ద స్థలం అవసరం లేదు. ఇంట్లో ఒక కుండీ ఉంటే చాలు.. సరైన మట్టి, తగినంత సూర్యరశ్మి, నీరు అందిస్తే చక్కగా పెరుగుతుంది. ఈ మొక్క తీగలా విస్తరిస్తుంది కాబట్టి పైకి పాకేందుకు చిన్న కర్ర లేదా జాలి ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మరి అపరాజిత మొక్కను విత్తనాల నుంచి ఎలా పెంచాలి? ఎక్కువ పూలు పూయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లూ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
అపరాజిత మొక్కకు ఎలాంటి కుండీ కావాలి?
అపరాజిత మొక్కను పెంచడానికి సుమారు 8 నుంచి 12 అంగుళాల లోతు, 12 నుంచి 14 అంగుళాల వెడల్పు ఉన్న కుండీని ఎంచుకోవచ్చు. మట్టి, ప్లాస్టిక్ లేదా సిమెంట్ కుండీ ఏదైనా ఉపయోగించవచ్చు. అయితే కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటే మొక్క వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
మొక్కకు తగినంత సూర్యరశ్మి అవసరం
అపరాజిత మొక్క బాగా పెరిగి ఎక్కువ పూలు పూయాలంటే రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగలాలి. అందుకే కుండీని బాల్కనీ, మేడ లేదా మంచి వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. తగినంత వెలుతురు లేకపోతే మొక్క పెరిగినా పూల సంఖ్య తగ్గవచ్చు.
ఎలాంటి మట్టిని ఉపయోగించాలి?
అపరాజిత మొక్కకు నీరు నిల్వ ఉండకుండా, గాలి సులభంగా ప్రసరించే మెత్తటి మట్టి అవసరం. మంచి నాణ్యత కలిగిన పాటింగ్ మిక్స్‌లో కొద్దిగా కంపోస్ట్ కలిపి కుండీలో నింపుకోవాలి. గట్టిగా ఉండే మట్టిని ఉపయోగించకూడదు. మట్టిలో తేమ ఉండాలి కానీ నీరు నిలిచిపోకూడదు. ఇలా ఉంటే మొక్క వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.
అపరాజిత మొక్కకు నీరు ఎప్పుడు పోయాలి?
మొక్కకు క్రమం తప్పకుండా నీరు అందించాలి. అయితే ప్రతిరోజూ ఒకే పరిమాణంలో నీరు పోయాల్సిన అవసరం లేదు. ముందుగా వేలితో మట్టిని తాకి చూడాలి. మట్టి తడిగా ఉంటే నీరు పోయాల్సిన అవసరం లేదు. పొడిగా అనిపిస్తే తగినంత నీరు పోయాలి. ముఖ్యంగా చిన్న మొక్కలకు అవసరమైన తేమ అందించాలి. కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
విత్తనాలతో అపరాజిత మొక్కను ఇలా పెంచండి
అపరాజిత మొక్కను విత్తనాల ద్వారా సులభంగా పెంచుకోవచ్చు. ముందుగా విత్తనాలను కొన్ని గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల విత్తనాల పైపొర మెత్తబడుతుంది. ఆ తర్వాత కుండీలో సుమారు ఒక అంగుళం లోతులో విత్తనాలను నాటాలి. ఒకదానికొకటి కొంత దూరం ఉండేలా చూసుకోవాలి. అనంతరం కొద్దిగా నీరు పోసి మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి.
తీగ పైకి పాకేందుకు ఆధారం ఏర్పాటు చేయాలి
అపరాజిత ఒక తీగజాతి మొక్క. ఇది సుమారు 15 అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కుండీలో చిన్న కర్రలు, తీగలు లేదా జాలి ఏర్పాటు చేయాలి. దీంతో మొక్క తీగలు పైకి పాకుతాయి. ఎండిపోయిన కొమ్మలను, అవసరానికి మించి విస్తరించిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవచ్చు. ఇలా చేస్తే మొక్కను అందంగా నిర్వహించుకోవచ్చు.
అపరాజిత పూలతో బ్లూ టీ తయారీ
అపరాజిత పూలతో బ్లూ టీ తయారు చేయడం చాలా సులభం. ముందుగా కొన్ని శుభ్రమైన అపరాజిత పూలను తీసుకోవాలి. ఒక కప్పు వేడి నీటిలో వాటిని వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. దీంతో నీరు నీలిరంగులోకి మారుతుంది. ఆ తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం కారణంగా టీ రంగు నీలం నుంచి ఊదా రంగులోకి మారుతుంది. అంతే.. ఆకర్షణీయమైన రంగులో బ్లూ టీ సిద్ధమవుతుంది.
గమనిక:
అపరాజిత పూలతో తయారు చేసే టీని తీసుకునే ముందు పూలను శుభ్రంగా కడగాలి. పురుగుమందులు లేదా రసాయనాలు ఉపయోగించిన మొక్కల పూలను టీ తయారీకి వాడకూడదు. బ్లూ టీ ఆరోగ్య సమస్యలకు మందు కాదు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, మందులు వాడుతున్నవారు దీన్ని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.