Headlines

Andhra Pradesh: 10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని నిర్ణయం..


Andhra Pradesh: 10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని నిర్ణయం..

పదేళ్ల పాటు ప్రాణంగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తిరిగాడు.. కట్ చేస్తే, ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాగానే కులం పేరు చెప్పి ముఖం చాటేశాడు. ప్రియుడి నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక, భవిష్యత్తు శూన్యంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలు నగరంలోని బుధవార్ పేటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవార్‌పేటకు చెందిన బోయ చిన్న మద్దిలేటి, శ్రీదేవి దంపతుల కూతురు మంజుల, గోనెగండ్లకు చెందిన కృష్ణమూర్తి గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. కాగా మంజుల బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ పరీక్ష రాసింది. మరోవైపు కృష్ణమూర్తికి ఇటీవల టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేతికి రాకముందు వరకు పెళ్లి చేసుకుంటానని చెప్పిన కృష్ణమూర్తి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాక మంజులను దూరం పెట్టడం ప్రారంభించాడు.

కులం పేరుతో తిరస్కరణ.. తీవ్ర మనస్తాపం

ఉద్యోగం వచ్చాక పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ కృష్ణమూర్తి చిరాకు పడుతూ వచ్చాడు. చివరికి తాము వేర్వేరు కులాలకు చెందినవారమని, కులాలు వేరు కావడంతో పెళ్లి చేసుకోవడం కుదరదని ముఖం మీదే తేల్చి చెప్పాడు. పదేళ్ల పాటు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, ఉద్యోగం రాగానే మోసం చేయడంతో మంజుల తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇంట్లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

అపస్మారక స్థితిలో పడి ఉన్న మంజులను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. చేతికి అందివచ్చిన కూతురు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రేమ పేరుతో తమ కూతురు జీవితాన్ని నాశనం చేసి, ఆత్మహత్యకు కారణమైన కృష్ణమూర్తిని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *