Headlines

Andhra Pradesh: సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు ఇస్తా! స్వామీజీ సంచలన ప్రకటన


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు రకరకాల హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో నగదు, మరెక్కడో భూములు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామ అభివృద్ధి కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తానని ఆయన ప్రకటించారు. మడకశిర మండలంలోని చందకచర్ల గ్రామానికి చెందిన భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయ స్వామీజీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో తనను సర్పంచ్‌గా ఎన్నుకోవాలని, అలా జరిగితే రూ.1.50 కోట్లను గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తానని వెల్లడించారు. ఈ ప్రకటనతో స్థానికంగా చర్చ మొదలైంది.

ఎన్నికల హామీలకు భిన్నంగా అభివృద్ధి ప్రతిపాదన

చందకచర్లలో చాలాకాలంగా నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధనుంజయ స్వామీజీ చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చు చేసే డబ్బు గ్రామానికి ఉపయోగపడితే మరింత ప్రయోజనం ఉంటుందనేది ఆయన ఆలోచన. అందుకే తనకు అవకాశం కల్పిస్తే వ్యక్తిగతంగా నిధులు సమకూర్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ముందుకొచ్చారు. ఈ నిధులతో గ్రామంలోని రహదారులను సీసీ రోడ్లుగా మార్చడం, ప్రతి ఇంటికీ మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడం, మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించడం వంటి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. వీటితోపాటు వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

రాజకీయ పార్టీలను ఒప్పించే ప్రయత్నం

గ్రామంలో ఎన్నికల కారణంగా రాజకీయ వైషమ్యాలు పెరగకూడదని స్వామీజీ అభిప్రాయపడుతున్నారు. పార్టీల మధ్య పోటీ, విభేదాల కంటే గ్రామాభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం టీడీపీ, వైసీపీ నేతలతో పాటు ఇతర స్థానిక నాయకులను కూడా కలిసి తన ప్రతిపాదనకు మద్దతు కోరనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని స్పష్టం చేశారు. మొత్తానికి సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న వారి హామీల మధ్య.. పదవి ఇస్తే గ్రామానికి రూ.1.50 కోట్లు అందిస్తానన్న ఈ స్వామీజీ ప్రతిపాదన ఇప్పుడు చందకచర్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *