Headlines

Andhra Pradesh: నాన్న నాటిన జ్ఞాపకం.. చెట్టు కోసం ఏకంగా ఇంటి ప్లాన్‌నే మార్చేసిన కొడుకులు


కన్నవారిపై ప్రేమను చాటుకోవడానికి భారీ విగ్రహాలు పెట్టక్కర్లేదు, పదిమందికీ ఆదర్శంగా నిలిచే ఒక మంచి పని చేస్తే చాలని నిరూపించారు ఆ కొడుకులు. కంటికి రెప్పలా పెంచిన నాన్న జ్ఞాపకంగా నాటిన చెట్టును నరకడానికి వారి మనసు ఒప్పలేదు. కొత్త ఇంటి నిర్మాణానికి అడ్డుగా వచ్చినా సరే, గొడ్డలి వేటు వేయకుండా ఆ చెట్టునే తమ ఇంటిలో అంతర్భాగంగా మార్చేసి తండ్రిపై తమకున్న మైన ప్రేమను, ప్రకృతిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ కొన్నేళ్ల క్రితం తమ ఇంటి ఆవరణలో ఒక వేప మొక్కను నాటారు. ఆయన దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచారు. కాలక్రమంలో మహబూబ్ సాహెబ్ కన్నుమూశారు. తండ్రి భౌతికంగా దూరమైనా, ఆయన నాటిన ఆ వేప చెట్టును ఆయన రూపంగానే భావించిన కుమారులు బాషా, రఫీలు దానికి నిత్యం నీళ్లు పోస్తూ ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వచ్చారు.

ఇంటి ప్లాన్‌నే మార్చేసిన చెట్టు ప్రేమ

ఇటీవల పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన ఆ సోదరులకు వేప చెట్టు ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణంగా ఎవరైనా ఆ చెట్టును నరికేసి ఇల్లు కట్టేసుకునేవారు. కానీ బాషా, రఫీలకు మాత్రం తండ్రి స్వయంగా నాటిన ఆ చెట్టును నరకడం తండ్రినే నరికేసినంత బాధ కలిగించింది. దీంతో ఇంజనీర్‌తో మాట్లాడి ఇంటి ప్లాన్‌నే మార్చేశారు. చెట్టుకు ఎటువంటి నష్టం కలగకుండా దాని ఎదుగుదలకు అనువుగా చుట్టూ ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఆ చెట్టే మా నాన్న.. రోజూ ఆయన్నే చూసుకుంటున్నాం

‘‘మా నాన్న భౌతికంగా మా మధ్య లేకపోయినా, ఈ వేప చెట్టు రూపంలో ప్రతిరోజూ మాకు కనిపిస్తూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యమైన ఈ చెట్టును నరకడం మా వల్ల కాలేదు. చెట్టు కోసం కొద్దిగా స్థలం తగ్గినా మాకు బాధ లేదు, నాన్న ప్రేమ మా ఇళ్లంతా నిండి ఉన్న భావన కలుగుతోంది’’ అని కుమారులు బాషా, రఫీ భావోద్వేగంతో తెలిపారు.

తండ్రిపై అంతులేని ప్రేమతో పాటు, చెట్లను నరికేస్తున్న నేటి సమాజంలో పచ్చదనాన్ని కాపాడుతూ ఈ సోదరులు తీసుకున్న నిర్ణయం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి ఆదర్శాన్ని చూసి గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *