Andhra Pradesh: దట్టమైన అడవిలోనే.. నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే.. వాళ్లే గనుక లేకుంటే.. వీడియో చూడండి..

Andhra Pradesh: దట్టమైన అడవిలోనే.. నిండు గర్భిణికి ఎంత కష్టమొచ్చే.. వాళ్లే గనుక లేకుంటే.. వీడియో చూడండి..


ఆధునిక యుగంలో ప్రపంచం పరుగులు పెడుతున్నా.. ఇంకా అడవి బిడ్డలకు కనీస సౌకర్యాలు ఆమడ దూరంలోనే ఉన్నారు. చాలాచోట్ల మారుమూల ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేక ఆ గిరి పుత్రుల కష్టాలు అన్ని ఇన్ని కావు. రహదారి లేక.. దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు తేలిన మార్గంలోనే వాళ్ళ ప్రయాణం. ఏ అవసరమున్నా కొండలు గుట్టలు దాటుకుంటూ.. ముందుకు సాగాల్సిందే. రోగం వచ్చినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా డోలి కట్టాల్సిందే.. కిలోమీటర్ల దూరం మోయాల్సిందే. కానీ కొన్నిసార్లు సమస్య తీవ్ర రూపం దాల్చి ప్రాణాలపైకి వచ్చే సందర్భాలు కూడా లేకపోలేదు. తాజాగా ఓ నిండు గర్భిణీ పురిటి నొప్పులు రావడంతో కొంతదూరం నడిపించుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత నడవలేకపోవడంతో డోలి కట్టారు. రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తుండగా… మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. అదృష్టవశాత్తు తల్లీబిడ్డ ప్రాణాలతో ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి చెందిన సిదిరి దేవి నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎందుకంటే అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించాలంటే రహదారి సౌకర్యం సరిగా ఉండదు. నడవాలంటేనే కష్టం. అటువంటి పరిస్థితుల్లో గర్భిణీకి తీసుకెళ్లడం.. సాధారణ విషయం కాదు. లాగోలా ధైర్యం చేశారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు. 108కు సమాచారం అందించారు. రహదారి మార్గం ఉన్న ఈదులగరువు గ్రామం వరకు అంబులెన్స్ వచ్చి ఆగింది. సిబ్బంది పెద్ద మనసు చేసుకొని అటవీ మార్గం గుండా నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. డోలి కట్టారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి డోలీలో ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడే చీరను తెరలా కట్టి ప్రసవం చేశారు. దేవి.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొంత దూరం వరకు తల్లి బిడ్డను తీసుకెళ్లి.. అంబులెన్స్‌లో జి.మాడుగుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి.. కుటుంబసభ్యులు చేతులెత్తి దండం పెట్టారు. వాళ్లు సరైన సమయంలో స్పందించకపోతే పరిస్థితి ఏమయ్యేదో అని వాపోయారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *