Headlines

Andhra Pradesh: ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..?


ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత జర్నీ మహిళలకు అమలు చేస్తున్నారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయడం లేదు. ఐదు కేటగిరీల బస్సుల్లో మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో సీట్లు దొరక్క మహిళలు వాగ్వాదానికి దిగుతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ..

ఏసీ బస్సుల్లో కూడా త్వరలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలో రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వీటిల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మోగల్తూరులో మంగళవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు. ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం గత కొద్ది నెలలుగా కసరత్తు చేస్తోంది. గతంలో దీనికి సంబంధించి వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు చంద్రబాబు అధికారికంగా ప్రకటించడంతో త్వరలోనే అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మిగతా బస్సులపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

త్వరలోనే అమలుకు రెడీ..

ఏసీ బస్సుల్లో కూడా అమలు చేస్తే స్త్రీశక్తి పథకాన్ని మరింత విస్తరించినట్లు అవుతుంది. దీని వల్ల మహిళలకు మరింత ప్రయోజనం కలగనుంది. వేసవికాలంలో హాయిగా ఏసీ బస్సుల్లో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత జర్నీ అవకాశం తీసుకొచ్చింది. దివ్యాంగశక్తి అనే పథకం ద్వారా దీనిని అమలు చేస్తోంది. 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వ్యక్తికి ఇది వర్తిస్తుంది. దివ్యాంగులకు పాటు తోడుగా వచ్చే వ్యక్తికి టికెట్ ధరలో 50 శాతం రాయితీ అందిస్తోంది. దివ్యాంగ శక్తి స్కీమ్ కూడా పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు,సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలవుతోంది. అయితే దివ్యాంగులకు కూడా ఏసీ బస్సుల్లో ఉచిత జర్నీ వర్తింపచేస్తారా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం వీరికి ఇతర బస్సుల్లో 50 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *