Headlines

Andhra News: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి!


తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన 13 రోజులకే ఓ చిన్నారి సరికొత్త రికార్డు సాధించింది. ఏకంగా ఆ పాప పేరు ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ నమ్మాల్సిందే! శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్రపు ఆశిష్, గీతామాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీ పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొంది సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 19 రోజుల వయసు గల చిన్నారి పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇచ్ఛాపురం పట్టణం దాసన్నపేటకు చెందిన వజ్రపు ఆశిష్, గీతామాధురిల వివాహం కొన్నాళ్ల క్రితం జరిగింది. మే 30న ఈ దంపతులకు పాప జన్మించగా, ఆ చిన్నారికి ‘అగస్య ప్రిన్సీ’ అని నామకరణం చేశారు. ఆశిష్ శ్రీకాకుళంతో పాటు లండన్‌లోనూ పాస్టర్‌గా సేవలు అందిస్తుంటారు. దాంతో ఆయన తరచూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో తనతో పాటు కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాల్సి రావడంతో, ఇటీవల జన్మించిన అగస్య ప్రిన్సీకి కూడా పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేశారు. పరిశీలించిన అధికారులు ఆ పాపకు పాస్‌పోర్టును మంజూరు చేశారు.

ఇలా పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు సాధించి ప్రిన్సీ ఈ అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ రికార్డు గురించి ప్రిన్సీ తాత వజ్రపు వెంకటేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జూన్ 12న ప్రిన్సీ పేరు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైనట్లు ఆయన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *