Amaravati: హై స్పీడ్‌లో అమరావతి నిర్మాణం.. వినియోగానికి సిద్ధమైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు

Amaravati: హై స్పీడ్‌లో అమరావతి నిర్మాణం.. వినియోగానికి సిద్ధమైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు


రాష్ట్ర రాజధాని నరగం అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకు చేరుకున్నాయి. రంగురంగుల డిజైన్లు, ఆధునిక సౌకర్యాలతో ఈ నివాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం రాజధానిలోనే పని చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో అమరావతిని పూర్తి స్థాయి పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

కేవలం నివాసాలకే కాకుండా, ప్రభుత్వ ప్రతిష్టను ప్రతిబింబించే కీలక భవనాల నిర్మాణం కూడా సమాంతరంగా జరుగుతోంది. ప్రత్యేకంగా హైకోర్టు భవనం నిర్మాణం గణనీయంగా పురోగమిస్తోంది. సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 8 అంతస్తులతో నిర్మితమవుతున్న ఈ భవనం రాజధానికే తలమానికంగా నిలవనుంది. ఆధునిక శైలిలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం న్యాయ వ్యవస్థకు ప్రతీకగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఇక ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. బేస్‌మెంట్, పిల్లర్ పనులు దాదాపు పూర్తి దశకు చేరుకుంటుండగా, రాబోయే సంవత్సరాల్లో ఈ టవర్స్ అమరావతి స్కైలైన్‌ను మార్చేలా నిలుస్తాయని అంచనా ఉంది. అలాగే అసెంబ్లీ భవనం నిర్మాణం కూడా ప్రాధాన్యతతో కొనసాగుతోంది.రాజధాని ప్రాంతం అంతటా వేలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఒకవైపు భారీ భవనాలు రూపు దిద్దుకుంటుండగా.. మరోవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా సమాంతరంగా కొనసాగుతోంది.

రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి పైప్‌లైన్లు వంటి పనులు ఇప్పటికే పలు కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని కీలక నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. 2029 ఎన్నికల నాటికి సంపూర్ణ రాజధానిని ప్రజల ముందుంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దూసుకుపోతోంది. మొత్తంగా చూస్తే, అమరావతి మరోసారి నిర్మాణ హోరుతో కళకళలాడుతూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పరిపాలనా కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *