
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న ఈ కాలంలో వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో కూడా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అప్పుల బారిన పడిన వారికి AI ఆధారిత టూల్స్ ఒక మార్గదర్శకంగా మారుతున్నాయి. వ్యక్తి తన ఆదాయం, ఖర్చులు, ఉన్న రుణాలు, వడ్డీ రేట్లు వంటి వివరాలను ఇవ్వగానే, AI వాటిని విశ్లేషించి ఒక స్పష్టమైన చెల్లింపు ప్రణాళికను సూచించగలదు. ప్రస్తుతం చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, మింట్, మెటా ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు ఖర్చులను ట్రాక్ చేయడం, బడ్జెట్ రూపొందించడం, అప్పులు తగ్గించే మార్గాలను సూచించడం వంటి సేవలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను ముందుగా చెల్లించే డెట్ అవలాంచ్ పద్ధతి లేదా చిన్న రుణాలను ముందుగా తీర్చే డెట్ స్నోబాల్ పద్ధతులను AI సూచించవచ్చు.
AI ప్రధాన ప్రయోజనం వ్యక్తిగతీకరణ. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉండటంతో, ఒకే విధమైన సలహా అందరికీ సరిపోదు. AI మాత్రం మీ డేటా ఆధారంగా మీకు సరిపోయే ప్రణాళికను రూపొందిస్తుంది. అంతేకాకుండా అవసరం లేని ఖర్చులను గుర్తించి తగ్గించేందుకు కూడా సూచనలు ఇస్తుంది. అయితే AI ఇచ్చే సలహాను పూర్తిగా ఆధారపడటం సరైంది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
AI ఒక సహాయక సాధనం మాత్రమే. తుది నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అదనంగా వ్యక్తిగత ఆర్థిక సమాచారం పంచుకునేటప్పుడు గోప్యత, డేటా భద్రత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. AI సహాయంతో అప్పులు తీర్చుకోవడం సాధ్యమే. సరైన వివరాలు అందిస్తే, అది ఒక క్రమబద్ధమైన మార్గాన్ని చూపగలదు. కానీ జాగ్రత్తగా ఉపయోగిస్తేనే ఇది నిజమైన ప్రయోజనాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి