Headlines

రాజకీయాల్లోకి షమీ..! బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ప్రత్యేక భేటీ..


భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆదివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది వారాలకే, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు ఇంకా బయటకు రాలేదు. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరిన వారం రోజులకే షమీ, నితిన్ నబీన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా చాహల్‌ను పార్టీ నియమించింది. క్రికెటర్లు రాజకీయాల్లోకి వస్తున్న తీరుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా, తాజాగా షమీ భేటీతో మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది.

గతంలోనూ ప్రచారం..

గతంలోనూ షమీ పలువురు రాజకీయ నేతలను కలిసినా, అవి ఎలాంటి అధికారిక రాజకీయ ప్రకటనలకు దారితీయలేదు. సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ చౌదరితో షమీ భేటీ అయినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఊహాగానాలు వినిపించాయి. అయితే అమ్రోహాలో క్రీడా సౌకర్యాల కోసం నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే షమీ కలిశారని అప్పట్లో ఆర్‌ఎల్‌డీ స్పష్టం చేసింది.

టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత షమీ కెరీర్

36 ఏళ్ల మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడారు. 64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన షమీ, నవంబర్ 6న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆయన చివరి టెస్ట్ మ్యాచ్ 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగింది. టెస్ట్‌ల నుంచి తప్పుకున్నప్పటికీ, వన్డేలు, టీ20లో ఆడతానని షమీ స్పష్టం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *