
వీకెండ్ వచ్చిందంటే చాలా ఇళ్లలో చికెన్, మటన్ ఘుమఘుమలాడుతూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొన్ని నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మటన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అతిగా తింటే అది ఆరోగ్యానికి మేలు చేయకపోగా, శరీరానికి హాని చేసే స్థాయికి చేరుతుంది. మటన్ ఎవరు తినకూడదు, ఎందుకు దూరంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం.
మటన్ తినకూడని వారు వీరే.. ఆరోగ్యంపై ప్రభావం ఇదే
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మటన్ తినడం వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు: మటన్‌లో చెడు కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయి వాటిని మూసుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అధిక రక్తపోటు ఉన్నవారు: మటన్‌లో సహజంగానే సోడియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వంటలో ఉపయోగించే ఉప్పు, మసాలాలు రక్తపోటును త్వరగా పెంచే అవకాశం ఉంది.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు: మటన్‌లో ఉండే అదనపు ప్రోటీన్, ఫాస్ఫరస్‌ను శరీరం నుంచి వడపోయడానికి మూత్రపిండాలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి అదనపు భారం, మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది.
గౌట్, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు: ఎర్ర మాంసమైన మటన్‌లో ‘ప్యూరిన్’ అనే రసాయనం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి, కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపులకు కారణమవుతుంది.
జీర్ణ సంబంధిత రుగ్మతలు, పిత్తాశయ రాళ్లు ఉన్నవారు: మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల జీర్ణ సంబంధిత సమస్యలు లేదా పిత్తాశయ రాళ్లు ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది.
బరువు తగ్గాలనుకునే వారూ జాగ్రత్త..
పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు లేకపోయినా, బరువు తగ్గాలనుకునే వారు కూడా మటన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మటన్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల ఎవరైనా సరే తమ ఆరోగ్య పరిస్థితి, శరీర తత్వాన్ని బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.