గత కొన్ని నెలలుగా వినియోగదారులను తీవ్రంగా కలవరపెట్టిన బియ్యం ధరలు.. ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు.. ప్రస్తుతం స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. ప్రభుత్వ కఠిన చర్యలు, మార్కెట్లోకి కొత్త పంట రాక, సరఫరా పెరుగుదల వంటి కారణాలతో బియ్యం ధరలు పడిపోతున్నాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట కల్గిస్తోంది. బియ్యం అనేది ప్రతి ఇంట్లో నిత్యం అవసరమయ్యే నిత్యావసర సరుకు. దీని ధరల పెరుగుదల సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సన్న బియ్యం ధరలు ఎల్‌నివో ప్రభావంతో అనూహ్యంగా పెరిగాయి. నాలుగు నెలల క్రితం కిలో రూ.50 నుంచి రూ.55 ఉన్న కొన్ని రకాలు.. ఒక్కసారిగా రూ.65 నుంచి రూ.80కి చేరాయి. కొన్ని ప్రీమియం రకాలు అంతకంటే ఎక్కువ ధర పలికాయి. దీంతో సామాన్యులు బియ్యం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే బియ్యం ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. తెలంగాణలో సన్న వడ్లకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. నాణ్యమైన ధాన్యాన్ని ఈ రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయడంతో స్థానిక మార్కెట్లో లభ్యత తగ్గింది. ప్రతీకూల వాతావరణ పరిస్థితులు, మిల్లింగ్ ఖర్చులు, సరఫరా వ్యవస్థలో లోపాలు, కృత్రిమ కొరత వంటివి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం ధరలపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. పెరుగుతున్న ధరలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. బియ్యం నిల్వలపై నిఘా మరింత పెంచింది. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై తనిఖీలు నిర్వహించింది. మార్కెట్లోకి ప్రభుత్వ నిల్వలను విడుదల చేయడం ద్వారా ధరల నియంత్రణకు ప్రయత్నించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో 1,141 తనిఖీలు చేసి 55 కేసులు నమోదు చేశారు. వీటిలో 35 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. తూకంలో మోసాలు, పాత ధరల స్టిక్కర్లపై కొత్త ధరలు అంటించడం వంటి అక్రమాలను గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పుడు బియ్యం ధరలు దిగి వస్తున్నాయి.
ప్రస్తుతం బీపీటీ, కేఎన్ఎం రకాలు కిలో రూ.66కు, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకాలు కిలోకు రూ.74కు, హెచ్ఎంటీ, జెఎస్ఆర్ రకాలు కిలోకు రూ.79కు లభిస్తున్నాయి. అటు కేంద్రం కూడా ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ధరలు తగ్గాయి. అయితే అన్ని రకాల బియ్యం ధరలు ఒకే స్థాయిలో తగ్గలేదు. రకం, నాణ్యత, బ్రాండ్, ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలున్నాయి. కొత్త ధాన్యం మార్కెట్లోకి వస్తుండటంతో బియ్యం సరఫరా పెరిగే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే గతంలో అందుబాటులో ఉన్న ధరలకు బియ్యం లభించేలా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. కొత్త పంట సరఫరా, ప్రభుత్వ చర్యలు కొనసాగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే డిమాండ్ పెరిగి, సరఫరా తగ్గితే మళ్లీ ధరలు పెరిగే ప్రమాదం లేకపోలేదు.