న్యూఢిల్లీ: లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ఎన్నికల పటాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రతిపాదన భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లే కుట్రలో భాగమని విమర్శించారు. శనివారం (నవంబర్ 28) న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రతిపాదనపై పలు కీలక ఆరోపణలు చేశారు.
లోక్‌సభ స్థానాలను 850కి పెంచాల్సిన అవసరం ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని, ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపుతూ 850 సీట్ల ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం బీజేపీకి లభిస్తుందని అన్నారు. ప్రతిపక్షాలకు, తమను వ్యతిరేకించే సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల వ్యవస్థపైనా ఆరోపణలు
2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియపైనా రాహుల్ గాంధీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం సహకారంతోనే ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్హత లేని 14 కోట్ల మంది ఓటు వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు, ఎన్నికల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని ఆరోపించారు. హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో ఓటరు పేరు నమోదైందని గతంలో చేసిన ఆరోపణను కూడా ప్రస్తావించారు.
డీలిమిటేషన్ కమిషన్‌పై అభ్యంతరాలు
డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, దాని కూర్పుపైనా రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్‌లో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు కీలక పాత్ర కల్పించడంతోపాటు, మూడో సభ్యుడి ఎంపికలోనూ ఆయనకు అధికారం ఉండేలా ప్రతిపాదనలు ఉన్నాయని ఆరోపించారు. దీనివల్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు కమిషన్‌పై పూర్తి నియంత్రణ లభించే ప్రమాదం ఉందన్నారు. కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయానికి నష్టం జరుగుతుందా?
2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, 2027 జనాభా లెక్కలు, తాజా కులగణన గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. తాజా గణాంకాలను పక్కనపెట్టడం వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ఉపకోటా కల్పించాలని, అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా పక్షపాత రహిత డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రాల ప్రస్తుత లోక్‌సభ స్థానాల వాటాలో మార్పులు చేయకూడదని స్పష్టం చేశారు.
చివరిగా, 850 అనేది కేవలం సీట్ల సంఖ్య కాదని, దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే అంశమని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్ కుమార్లపై తీవ్ర విమర్శలు చేస్తూ, దేశాన్ని నియంతృత్వంలోకి వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Delhi: Displaying a comparison chart, Lok Sabha LoP Rahul Gandhi says, “On seats, they want 850, while we say maintain the current seats; they say use the 2011 Census, while we say no, social justice requires and the law requires that we use the latest census, using 2027 caste census data…We want a bipartisan Delimitation Commission. They want women’s reservation at 850, and we say at 543, with a sub-quota for OBCs.”
— ANI (@ANI) November 28, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..