Headlines

డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి సమరశంఖం.. 40 కిలోమీటర్ల మహాపాదయాత్రతో యువతకు సందేశం!


మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి.. డ్రగ్స్ రహిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి! ఇదే నినాదంతో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి చేపట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మహాపాదయాత్ర విజయవంతంగా ముగిసింది. అంబర్‌పేటలో ప్రారంభమైన ఈ యాత్ర జూబ్లీహిల్స్ వరకు సుమారు 40 కిలోమీటర్లు సాగింది. వేలాది మంది యువత, విద్యార్థులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అడుగులో అడుగు వేస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. శుక్రవారం (నవంబర్ 27) జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన ముగింపు సభలో మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

40 కి.మీ. మూడు రోజుల సందేశాత్మక యాత్ర!

నవంబర్ 25న అంబర్‌పేటలోని మహంకాళి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో ప్రజలకు వివరించడంతో పాటు, వ్యసనాల నుంచి బయటపడేందుకు సామాజిక అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.

మొదటి రోజు సినీ నటుడు నిఖిల్, నటి పాయల్ రాజ్‌పుత్ పాల్గొని యువతకు సంఘీభావం తెలిపారు. రెండో రోజు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ యాత్రలో అడుగులు కలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ డప్పు కొడుతూ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.

మూడో రోజు అమీర్‌పేట ప్రాంతంలో సినీ నటులు నాగార్జున, సాయికుమార్, శివాజీ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పాల్గొని నషా ముక్త్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా మూడు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనడంతో పాదయాత్రకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

యువతతోనే డ్రగ్స్ రహిత భారత్ సాధ్ం: కిషన్‌రెడ్డి

పాదయాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం దేశ యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఈ పాదయాత్ర రాజకీయాలకు అతీతంగా నిర్వహించామని, విద్యార్థులు, యువత, మహిళలు, సినీ ప్రముఖులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత తమ శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. దేశ భవిష్యత్తును కాపాడండి: చిరంజీవి

ముగింపు సభలో పాల్గొన్న పద్మవిభూషణ్ చిరంజీవి యువతకు కీలక సందేశం ఇచ్చారు. యువత తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, పద్మవిభూషణ్, ఏఐజీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి కూడా ముగింపు కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

అవగాహనతోనే వ్యసనాలకు అడ్డుకట్ట

మొత్తంగా కిషన్‌రెడ్డి చేపట్టిన మూడు రోజుల మహాపాదయాత్ర డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో సామాజిక భాగస్వామ్యం ప్రాధాన్యతను చాటింది. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా విద్యాసంస్థలు, కుటుంబాలు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం గుర్తుచేసింది.

డ్రగ్స్‌కు బానిసలైన వారిని నిందించడం కంటే వారికి సరైన కౌన్సెలింగ్, వైద్య సహాయం అందించడం కూడా అంతే ముఖ్యమనే అవగాహన సమాజంలో పెరగాలి. యువతను వ్యసనాల నుంచి కాపాడేందుకు నిరంతర అవగాహన, నివారణ చర్యలు, పునరావాస కార్యక్రమాలు అవసరం. హైదరాబాద్‌లో ముగిసిన ఈ పాదయాత్ర సందేశం కూడా అదే.. మత్తు వద్దు.. యువత భవిష్యత్తే ముద్దు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *