
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గుడ్ న్యూస్ ప్రకటించింది. కొత్తగా తీసుకున్న నిర్ణయంతో మొబైల్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. కాగా టెలికాం సంస్థలు తమ యాప్‌లు, వెబ్సైట్లలో తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లను సులభంగా చూపించడం లేదన్న ఫిర్యాదులపై ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై చౌకైన ప్లాన్ల కోసం అనేక పేజీలు వెతకాల్సిన పనిలేకుండా.. యాప్ తెరవగానే మొదట వాటినే చూపించాలని సంస్థలను ఆదేశించింది.
అసలు సమస్య ఏమిటి?
సాధారణంగా జియో, ఎయిర్టెల్ యాప్‌లు ఓపెన్ చేయగానే డేటా, ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఖరీదైన ప్లాన్లే ముందుగా కనిపిస్తాయి. ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్ కోసం చౌకైన ప్లాన్లు కావాలనుకునే వారు వాటిని వెతకడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. తక్కువ ధర ప్లాన్లను మొదట చూపిస్తే యూజర్లు వాటినే ఎంచుకుంటారనే ఆలోచనతో ఈ తరహా ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ కారణం వల్లే తమ ఆదాయం తగ్గుతుందని టెలికాం కంపెనీలు ఈ విధంగా రీఛార్జ్ ప్లాన్స్ చూపిస్తున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.
ట్రాయ్ కొత్త నిబంధనలు ఇవే !
నూతనంగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం… అన్ని టెలికాం సంస్థలు తమ ప్రీపెయిడ్ విభాగంలో ‘TRAI-Mandated Packs’ పేరుతో ప్రత్యేక ట్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. యాప్ లేదా వెబ్సైట్ తెరవగానే అన్నింటికంటే ముందుగా ఇదే ట్యాబ్ కనిపించాలి. ఇందులో ట్రాయ్ నిబంధనల ప్రకారం ఉండే తక్కువ ధర, వాయిస్ ఓన్లీ ప్లాన్ల వివరాలను ఉంచాలి. ఈ మార్పులను అమలు చేసి 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ట్రాయ్ స్పష్టం చేసింది.
కంపెనీల ఆదాయంపై ప్రభావం ఎంత?
అయితే చౌకైన ప్లాన్లను ముందుగా చూపిస్తే ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) తగ్గుతుందని టెలికాం సంస్థలు ఆందోళన చెందుతున్నట్టు బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనివల్ల ఎయిర్టెల్ ఆదాయంపై 1 శాతం కంటే తక్కువగా, వొడాఫోన్ ఐడియా (Vi)పై సుమారు 2.3 శాతం మాత్రమే ప్రభావం ఉండవచ్చని యాక్సిస్ క్యాపిటల్ విశ్లేషకులు అంచనా వేశారు.
మరోవైపు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే తక్కువ ధర ప్లాన్లను మొదటి ట్యాబ్‌లో ఉంచగా.. జియో, ఎయిర్టెల్ యాప్‌లలో మాత్రం ఇంకా మార్పు రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ రానున్న రోజుల్లో అయినా ట్రాయ్ ఆదేశాలతో ఆయా యాప్‌ల ఇంటర్ఫేస్ మారాలని కోరుతున్నారు. మొత్తంగా ట్రాయ్ ఆదేశాలతో సామాన్య వినియోగదారులకు కొంత మేలు కలుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం కాలింగ్ ప్లాన్లు వాడేవారికి ఇది పెద్ద ప్రయోజనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.