Headlines

మహిళా కలెక్టర్‌ వేధింపుల కేసులో సంచలనం.. టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్!


Tvk Mla C. Arul Vignesh

చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార టీవీకే (TVK) ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కల్లకురిచ్చి నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. మద్రాస్ హైకోర్టు జోక్యం, విచారణలో వేగం పెంచాలన్న ఆదేశాల నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది

అసలేం జరిగింది?

కల్లకురిచ్చి జిల్లాకు చెందిన మహిళా కలెక్టర్ తనను ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడమే కాకుండా, బహిరంగ కార్యక్రమాల్లో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా మద్యం మత్తులో తన అధికారిక నివాసానికి వచ్చేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ గతంలో స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. తనపై రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

116 రోజుల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

ఈ వ్యవహారంపై జూలై 31న ప్రభుత్వానికి సమాచారం అందినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరిగిందని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. నవంబర్ 23న మహిళా కలెక్టర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అనంతరం నవంబర్ 24న విచారణ సందర్భంగా కోర్టు పోలీసు దర్యాప్తును సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని ఆదేశించింది. తిరుప్పూర్ ఎస్పీ సృష్టి సింగ్‌ను దర్యాప్తు అధికారిగా, ఐజీ ఎన్. కామినిని పర్యవేక్షణ అధికారిగా నియమించారు. అలాగే మహిళా అధికారిణి ఫిర్యాదుపై విచారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

జాతీయ మహిళా కమిషన్ జోక్యం!

ఈ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక అందించాలని పోలీసులను కోరింది. మరోవైపు బాధిత అధికారిణి గుర్తింపును బయటపెట్టకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.

స్టాలిన్ ఏమన్నారంటే?

ఎమ్మెల్యే అరెస్టుపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. మహిళా అధికారిణి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంలో 116 రోజుల జాప్యం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై కూడా జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు. కోర్టు, మహిళా కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాతే అరెస్టు జరిగిందని విమర్శించారు.

ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డిసెంబర్ 22లోగా తుది నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తు, న్యాయస్థాన విచారణలో తేలాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *