భారత్-నేపాల్ సరిహద్దులను కలుపుతూ కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయల్దేరనున్న ఈ రైలు.. నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌కు చేరుకోనుంది. వీక్లీ ట్రైన్‌గా దీనిని ప్రవేశపెట్టగా.. వారానికి ఒకసారి అందుబాటులో ఉంటుంది. నవంబర్ 23వ తేదీన భారత ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని బలేంద్ర షా వర్చువల్ విధానంలో పచ్చజెండా ఊరి ఈ రైలు ప్రారంభించారు. అయితే నవంబర్ 28వ తేదీ నుంచి పూర్తి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఐఆర్సీటీసీ వెబ్ సైట్, యాప్ ద్వారా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్‌కు సంబంధించిన టికెట్ ఛార్జీలు, లగేజీ పరిమితులకు సంబంధించిన వివరాలను రైల్వేశాఖ వెల్లడించింది.
ఛార్జీలు ఎంతంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ థామ్ వరకు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.365గా ఉంది. థర్డ్ ఏసీ ఎకానమీ టికెట్ ధర రూ.885, 3 టైర్ టికెట్ ధర రూ.965, ఏసీ 2 టైర్ ధర రూ.1360గా ఉంది. ప్రాథమిక ఛార్జీకి అదనంగా నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఫీజులు, వర్తించే సర్ఛార్జీలు, జీఎస్టీ వంటివి ఉంటాయి.
షెడ్యూల్ ఇదిగో..
అయోధ్య కంటోన్మెంట్ నుండి జనక్‌పూర్ ధామ్(సరియు కమలా ఎక్స్‌ప్రెస్ 15596) ప్రతీ సోమవారం అందుబాటులో ఉంది. ఇక జనక్‌పూర్ ధామ్-అయోధ్య కంటోన్మెంట్(15595) రైలు ప్రతీ శనివారం సర్వీసులు అందించనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 17 కోచ్‌లు ఉంటాయి. స్లీపర్ కోచ్‌లతో పాటు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. జనక్‌పూర్ ధామ్-అయోధ్య కంటోన్మెంట్(15595) రైలు ప్రతీ శనివారం మధ్యాహ్నం 1.10 గంటలకు జనక్‌పూర్ థామ్ నుంచి బయల్దేరి.. ఆదివారం ఉదయం 8.10 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో 15596 నెంబర్ ట్రైన్ ప్రతీ సోమవారం సాయంత్రం 5.50 గంటలకు అయోధ్య నుంచి బయల్దేరి మంగళవరం మధ్యాహ్నం 12.40 గంటలకు జనక్ పూర్ ధామ్ చేరుకుంటుంది.
ఈ ట్రైన్ అయోధ్య కంటోన్మెంట్, అయోధ్య ధామ్,మంకాపర్, సెటిల్మెంట్, గోరఖ్‌పూర్, రక్సౌల్, సీతామర్హి, మధుబని, జయనగర్, పానియాహ్వా, నార్కటియాగంజ్, శిషో, జయన్ కస్టమ్స్ యార్డ్, జనక్ పూర్ ధామ్ స్టేషన్లలో ఆగుతుంది. నేపాల్‌లో జయనగర్ కస్టమ్స్ యార్డ్, జనక్ పూర్ ధామ్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. అయితే ఈ రైల్లో ప్రయాణికులకు ప్రత్యేక నిబంధనలు విధించారు. భారత్, నేపాల్ పౌరులను మాత్రమే ఈ రైల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సమయంలో గుర్తింపు, జాతీయుత వివరాలు నమోదు చేయాలి. ఇక ఈ రైల్లో ఆర్ఏసీ, తత్కాల్, ప్రీమియం తత్కాల్ కోటాలు ఉండవు. కేవలం కన్పార్మ్‌డ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు అర్హులుగా చెప్పవచ్చు. 60 రోజుల ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఇక లగేజీ పరిమితి విషయానికొస్తే ఫస్ట్ ఏసీ కోచులో 70 కిలోగ్రాములు, సెకండ్ ఏసీ బోగీల్లో 50 కిలోగ్రాములు, ధర్డ్ ఏసీ, స్లీపర్ కోచుల్లో 40 కిలోగ్రాముల బరువు వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితి మించిన లేగేజీకి అదనపు ఛార్జీలు విధిస్తారు.