Headlines

రోడ్డుపై బారికేడ్లు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.. అసలు సీక్రెట్ ఇదే !!


రోడ్డుపై బారికేడ్లు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.. అసలు సీక్రెట్ ఇదే !!

సాధారణంగా రోడ్లపై ప్రయాణించేటప్పుడు సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్ గుర్తులు, బాణం గుర్తులు, వైట్ లైన్ వంటి ఎన్నో మార్కింగ్స్ కనిపిస్తాయి. వీటన్నింటి మధ్య ఎక్కువగా దృష్టిని ఆకర్షించేవి పసుపు రంగు బారికేడ్లు. నిర్మాణ ప్రాంతాలు, ప్రమాదకరమైన మలుపుల వద్ద పసుపు, నలుపు రంగుల్లో ఉండే బారికేడ్లు తరచూ కనిపిస్తాయి. ముందు ఏదో అడ్డంకి ఉందని వేగంగా గుర్తించేలా చేస్తూ, అప్రమత్తంగా ఉండాలనే సంకేతాన్ని ఇవి ఇస్తాయి.

కాగా భద్రతా సూచనల్లో రంగులకు ప్రత్యేక అర్థాలు ఉంటాయి. ఎరుపు రంగు తక్షణ ప్రమాదాన్ని లేదా ఆగాల్సిన అవసరాన్ని సూచిస్తే, పసుపు రంగు సాధారణంగా హెచ్చరిక లేదా అప్రమత్తతను తెలియజేస్తుంది. అందుకే పసుపు రంగుకు తోడు మధ్యలో నల్లటి చారలు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్నిచోట్లా పసుపు బారికేడ్లే కాకుండా అవసరాన్ని బట్టి నారింజ, తెలుపు రంగులతో పాటు రిఫ్లెక్టివ్ పట్టీలను కూడా వాడతారు. అయితే రోడ్డు బారికేడ్లకు ఎక్కువగా పసుపు రంగు వాడటం వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

పసుపు రంగుకు కారణం అదే..

మన కంటిలోని రెటీనాలో ఎల్ (Long), ఎం (Medium), ఎస్ (Short) అనే మూడు రకాల కోన్ కణాలు ఉంటాయి. ఇవి కాంతికి సంబంధించిన వేర్వేరు తరంగదైర్ఘ్యాలకు స్పందిస్తాయి. ముఖ్యంగా పసుపు రంగును గుర్తించడంలో ఎల్, ఎం కోన్ కణాల సంకేతాల కలయిక కీలకంగా పనిచేస్తుంది. దీని ప్రకాశవంతమైన స్వభావం, చుట్టూ ఉన్న రంగులతో ఏర్పడే తేడా వల్ల ఇది త్వరగా కంటికి కనిపిస్తుంది. పసుపు కాంతి తరంగదైర్ఘ్యం ఎరుపు కంటే తక్కువగా, నీలం కంటే ఎక్కువగా ఉంటుంది.

అంతేకాకుండా, డ్రైవర్లు ఎదురుగా రోడ్డుపై దృష్టి పెట్టి వాహనం నడుపుతున్నప్పుడు, పక్కల జరిగే కదలికలను (పెరిఫెరల్ విజన్) గుర్తించడంలో పసుపు రంగు చాలా వేగంగా పనిచేస్తుంది. దీనివల్ల మలుపుల వద్ద లేదా రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను డ్రైవర్లు దూరం నుంచే పసిగట్టగలుగుతారు. అయితే ఎరుపు రంగు కంటే పసుపు రంగు 1.24 రెట్లు వేగంగా కనిపిస్తుందని సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో మాత్రం శాస్త్రీయ ఆధారం లేదు.

పసుపు, నలుపు రంగు కాంబో..

పసుపు నేపథ్యంపై నల్లటి చారలు ఉండటం వల్ల ఆ బారికేడ్ రోడ్డు, దుమ్ము, చుట్టూ ఉన్న ఇతర వస్తువుల మధ్య స్పష్టంగా వేరుగా కనిపిస్తుంది. మనిషి మెదడు సహజంగానే ఈ రెండు రంగుల కలయికను చూడగానే అప్రమత్తమవుతుంది. అందుకే ముందు ఏదో అడ్డంకి ఉందని వాహనదారులు, పాదచారులు త్వరగా అర్థం చేసుకోవడానికి ఈ కాంబినేషన్ ఎంతగానో తోడ్పడుతుంది.

గమనించాల్సిన విషయాలు..

  • అన్ని పరిస్థితుల్లోనూ పసుపు రంగు వల్ల కంటికి ఇబ్బంది కలిగించే కాంతి (గ్లేర్) తక్కువగా ఉంటుందని చెప్పలేం. బారికేడ్ ఉపరితలం ఎలా ఉంది, దానిపై పడుతున్న వెలుతురు తీవ్రత ఎంత అనే అంశాలు అది ఎంత స్పష్టంగా కనిపిస్తుందనేది నిర్ణయిస్తాయి.
  • గాలిలోని నీటి బిందువులు కాంతిని చెదరగొడతాయి. కాబట్టి దట్టమైన పొగమంచులో ఒక బారికేడ్ ఎంత దూరం నుంచి కనిపిస్తుందన్నది కేవలం రంగు మీదే కాకుండా, దాని ప్రకాశం, ఆకారం, రిఫ్లెక్టివ్ గుణాలపై కూడా ఆధారపడి ఉంటుంది.
  • చీకటి పడినప్పుడు మన కంటి చూపు పనితీరు మారుతుంది. తక్కువ వెలుతురులో రాడ్ కణాలు ఎక్కువగా చురుగ్గా పనిచేస్తాయి. దీంతో రంగుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల రాత్రి వేళల్లో పసుపు రంగుకు పగలు ఉండేంత స్పష్టత ఉండదు. ఈ లోపాన్ని అధిగమించేందుకే బారికేడ్లపై ప్రత్యేకంగా ‘రిఫ్లెక్టివ్ టేపులను’ అంటిస్తారు. రాత్రిపూట వాహనాల హెడ్‌లైట్ల వెలుతురు వీటిపై పడినప్పుడు, ఆ కాంతి తిరిగి ప్రతిఫలించి బారికేడ్ ఎక్కడుందో స్పష్టంగా కనిపిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *