Headlines

Women Priests: మహిళలే పూజారులుగా ఉండే అరుదైన ఆలయం.. శ్రీ చక్రం ఆకారంలో అద్భుత నిర్మాణం!


Devipuram Temple Tripura Sundari Temple Story: సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా పురుషులే పూజారులుగా కనిపిస్తుంటారు. గర్భగుడిలో పూజలు చేయడం నుంచి ప్రత్యేక ఉత్సవాలు, ఇతర క్రతువుల వరకు అర్చకులే నిర్వహిస్తుంటారు. అయితే ఒక ఆలయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ మహిళలే పూజారులుగా ఉంటూ అమ్మవారికి నిత్య పూజలు, ప్రత్యేక పూజాధికాలను నిర్వహిస్తారు. అంతేకాదు.. ఈ ఆలయంలో రైతులు కూడా ఆధ్యాత్మిక సేవల్లో భాగస్వాములవుతుంటారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఆలయాన్ని సాధారణ నిర్మాణాలకు భిన్నంగా మహామేరు శ్రీ చక్రం ఆకారంలో నిర్మించారు. అందుకే ఈ క్షేత్రం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఎక్కడుంది ఈ అద్భుతమైన ఆలయం?

ఈ అరుదైన ఆలయం మరెక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దేవీపురంలో త్రిపురసుందరీ దేవి ఆలయం కొలువుదీరింది. ఇది ఎంతో మహిమాన్వితమైన శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. త్రిపురసుందరీ అమ్మవారి అనుగ్రహంతోనే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భక్తులు విశ్వసిస్తారు.

మహామేరు శ్రీ చక్రం ఆకారంలో ఆలయ నిర్మాణం

దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని మహామేరు శ్రీ చక్రం ఆకారంలో నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 108 అడుగుల ఎత్తు, 108 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ ఆలయం మూడు అంతస్తులను కలిగి ఉంటుంది. ఇందులో తొమ్మిది ఆవరణలు ఉండటం మరో విశేషం. శ్రీ చక్రంలోని ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణాన్ని రూపొందించారు. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి



గర్భగుడిలో సహస్రాక్షి రాజరాజేశ్వరి

ఈ ఆలయంలోని గర్భగుడిలో అమ్మవారు సహస్రాక్షి రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రధాన ఆలయంతో పాటు 108 మంది దేవతలకు సంబంధించిన ఉపాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో ఒకే ప్రాంగణంలో అనేక దైవ స్వరూపాలను దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది.

మహిళలే ఇక్కడ అర్చకులు!

ఈ దేవీపురం ఆలయంలో అందరినీ ఆశ్చర్యపరిచే మరో ప్రత్యేకత మహిళా అర్చకుల సంప్రదాయం. ఇక్కడ మహిళలే పూజారులుగా వ్యవహరిస్తూ అమ్మవారికి నిత్య పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. సాధారణంగా ఆలయాల్లో పురుషులే అర్చకులుగా ఉండే సంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ మహిళలకు పూజాధికారాలు కల్పించడం విశేషం. మహిళా అర్చకులతో పాటు రైతులు కూడా ఆలయ సేవల్లో భాగస్వాములవుతారు.

ముఖ్యంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మికత, ప్రకృతి, విశిష్టమైన నిర్మాణశైలి, మహిళా అర్చకుల సంప్రదాయం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దేవీపురం త్రిపురసుందరీ దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని అరుదైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

(Disclaimer: ఈ కథనంలోని ఆలయ విశేషాలు, ఆధ్యాత్మిక అంశాలు భక్తుల విశ్వాసాలు, స్థానికంగా ప్రచారంలో ఉన్న సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *