Headlines

భారత్‌లో రేపే కొత్త Mini Cooper SE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!


లగ్జరీ కార్ల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్ మినీ (MINI). బ్రిటిష్ డిజైన్ వారసత్వం, ప్రత్యేకమైన లుక్, ప్రీమియం ఫీచర్లు ఈ బ్రాండ్ కార్ల ప్రత్యేకతగా చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న పరిమాణంలో స్టైలిష్ కార్లను కోరుకునే వినియోగదారులను మినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న ఈ సంస్థ.. తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మినీ సంస్థకు చెందిన ఆల్-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు కూపర్ SE (MINI Cooper SE) నవంబర్ 27, శుక్రవారం భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ కారు కోసం ప్రీ-లాంచ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పెద్ద SUVలకు భిన్నంగా నగరాల్లో సులభంగా నడపగలిగే కాంపాక్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొస్తోంది.

భారత్‌లో ఈ కారు SE వేరియంట్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించిన ‘పాల్ స్మిత్ ఎడిషన్’లోనూ అందుబాటులోకి రానుంది. అలానే ఈ కారు బుకింగ్స్‌ను మినీ షోరూమ్‌లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంది. ముందుగా హైదరాబాద్‌లోని KUN Exclusive షోరూమ్‌కు టెస్ట్ డ్రైవ్ వాహనాలు రానున్నాయి. అనంతరం విజయవాడ, విశాఖపట్నంలోని BMW గ్రూప్ నెట్‌వర్క్ ద్వారా కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. డెలివరీ తేదీలు, వేరియంట్ల వారీగా ఫీచర్లు, ఇండియా-స్పెక్ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను లాంచ్ కార్యక్రమంలో వెల్లడించనున్నారు. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత ఉండొచ్చు? తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుంది? తెలుసుకుందాం.

Mini Cooper SE Electric ఫీచర్స్..

వేరియంట్లు..

భారత మార్కెట్‌లో మినీ కూపర్ SE రెండు ప్రత్యేక రూపాల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో స్టాండర్డ్ SE వేరియంట్‌తో పాటు పాల్ స్మిత్ ఎడిషన్ (Paul Smith Edition) ఉండనుంది. ప్రముఖ బ్రిటిష్ డిజైనర్ పాల్ స్మిత్ ప్రత్యేక డిజైన్ శైలిని ప్రతిబింబించేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే పాల్ స్మిత్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు, స్ట్రైప్స్, డిజైన్ హంగులు ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే రెండు మోడళ్లలోనూ ప్రధాన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఫీచర్లు ఒకే విధంగా ఉండనున్నాయి.

54.2 kWh బ్యాటరీ.. 402 కిలోమీటర్ల రేంజ్

ఈ కొత్త మినీ కూపర్ SEలో 54.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే WLTP పరీక్షా ప్రమాణాల ప్రకారం గరిష్ఠంగా 402 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. నగర ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేవారికి ఈ రేంజ్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వాస్తవ వినియోగంలో ప్రయాణించే దూరం డ్రైవింగ్ శైలి, వేగం, రోడ్డు పరిస్థితులు, ఏసీ వినియోగం, వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి మారుతుంది.

218 hp పవర్.. 330 Nm టార్క్

పెర్ఫార్మెన్స్ విషయంలోనూ ఈ ఎలక్ట్రిక్ కారు ఆకట్టుకునే గణాంకాలను కలిగి ఉంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 218 hp పవర్, 330 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా తక్షణ టార్క్ అందుబాటులోకి రావడంతో వేగంగా పికప్ పొందేందుకు అవకాశం ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన మోటార్ ఈ కారును ప్రత్యేకంగా నిలపనున్నాయి.

ఫాస్ట్ ఛార్జింగ్.. 

ఛార్జింగ్ విషయంలోనూ మినీ కూపర్ SEలో ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 95 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. దీనిద్వారా బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఇంటి వద్ద ఛార్జింగ్ చేసుకునేందుకు 7.4 kW AC ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీనికి అనుగుణంగా రాత్రిపూట వాహనాన్ని ఛార్జింగ్‌కు పెట్టుకోవచ్చు.

సింగిల్ పెడల్ డ్రైవింగ్..

నగరాల్లో ట్రాఫిక్ మధ్య కారు నడిపేటప్పుడు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు ఇందులో సింగిల్ పెడల్ డ్రైవింగ్ ఫీచర్ ఉంది. యాక్సిలరేటర్ పెడల్‌ను ఉపయోగించడం ద్వారా వేగాన్ని నియంత్రించుకోవడంతో పాటు పెడల్ నుంచి కాలు తీసినప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా బ్యాటరీకి కొంత శక్తిని తిరిగి అందించవచ్చు. దీంతో తరచూ బ్రేక్, యాక్సిలరేటర్ ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఉచిత AC వాల్‌బాక్స్ ఛార్జర్.. బ్యాటరీకి 8 ఏళ్ల వారంటీ

కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించేలా కంపెనీ కొన్ని సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా ఇన్‌స్టాలేషన్‌తో సహా ఉచిత AC వాల్‌బాక్స్ ఛార్జర్ అందించనున్నారు. అలాగే ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కల్పించనున్నారు. ఇక బ్యాటరీ విషయంలో 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీ అందించనున్నట్లు సమాచారం. అయితే వారంటీకి సంబంధించిన పూర్తి నిబంధనలు, కవరేజ్ వివరాలను అధికారికంగా నిర్ధారించుకోవాలి.

ధర.. 

కొత్త కూపర్ SE అధికారిక ఎక్స్‌షోరూమ్ ధరలను కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటించనుంది. అయితే డీలర్ వర్గాల సమాచారం ప్రకారం వేరియంట్లు, ప్రత్యేక ఎడిషన్‌ను బట్టి ఈ కారు ధర సుమారు రూ.50 లక్షల నుంచి రూ.58 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. పాల్ స్మిత్ ఎడిషన్ ప్రత్యేక డిజైన్ కారణంగా ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు వెల్లడైన తర్వాతే వేరియంట్ల వారీగా పూర్తి ధరల వివరాలు స్పష్టమవుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *