రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా భారత రైల్వే (Indian Railways) కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రైలు వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper). ముఖ్యంగా ఇందులోని ఫస్ట్ ఏసీ కోచ్ ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన లగ్జరీ ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించారు. అయితే ఇప్పటివరకు ప్రయాణికులు ఉపయోగిస్తున్న సంప్రదాయ ఫస్ట్ ఏసీ కోచ్‌తో పోలిస్తే ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? బెర్తులు, ఇంటీరియర్స్, బాత్రూమ్ సౌకర్యాలు, ఛార్జింగ్ పాయింట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి? ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అచిలేశ్వర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో దీన్ని వివరించారు.
వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ vs రెగ్యులర్ ట్రైన్ ఫస్ట్ ఏసీ మధ్య తేడా..
ఇవి కూడా చదవండి
ఇంటీరియర్స్‌లో ఆధునిక హంగులు
ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అచిలేశ్వర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో సంప్రదాయ ఫస్ట్ ఏసీ కోచ్, వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ కోచ్‌లలోని వసతులను పోల్చి చూపించారు. సంప్రదాయ ఫస్ట్ ఏసీ కోచ్‌లో క్లాసిక్ తరహా ఇంటీరియర్స్ కనిపిస్తే, వందే భారత్ స్లీపర్‌లో ఆధునికమైన, ప్రీమియం లుక్ కనిపిస్తుంది.
బెర్తుల విషయంలో ఏది బెస్ట్?
సంప్రదాయ ఫస్ట్ ఏసీలో బెర్తులు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, వందే భారత్ స్లీపర్‌లో మరింత మెత్తటి కుషనింగ్ అందించారు. దీంతో సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంది.
బాత్రూమ్ సౌకర్యాల్లో రెండింటి మధ్య తేడా..
రెండు కోచ్‌ల మధ్య బాత్రూమ్ సౌకర్యాలు విషయంలో కూడా తేడా ఉంది. సంప్రదాయ ఫస్ట్ ఏసీలో షవర్ సౌకర్యం ఉండగా, వందే భారత్ స్లీపర్‌లో హాట్ షవర్‌తో పాటు వాక్యూమ్ ఆధారిత టాయిలెట్ సదుపాయం కల్పించడం విశేషం.
ఆటోమేటిక్ డోర్లు..
సంప్రదాయ ఫస్ట్ ఏసీ కోచ్‌లలో ప్రయాణికులు చేతితో తెరిచి, మూసే తలుపులు ఉంటాయి. కానీ వందే భారత్ స్లీపర్‌లో టచ్ చేయగానే తెరుచుకునే ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఏర్పాటు చేశారు.
ఆధునిక ఛార్జింగ్ పాయింట్లు
ఛార్జింగ్ సౌకర్యాల విషయంలోనూ కొత్త కోచ్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ ఫస్ట్ ఏసీలో సాధారణ ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉండగా, వందే భారత్ స్లీపర్‌లో రీడింగ్ లైట్, త్రీ-పిన్ సాకెట్, యూఎస్బీ టైప్-ఏ, యూఎస్బీ టైప్-సీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో
ఈ రెండు కోచ్‌ల మధ్య తేడాలను వివరిస్తూ అచిలేశ్వర్ సింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆధునిక ఇంటీరియర్స్, మెరుగైన బెర్తులు, ఛార్జింగ్ సౌకర్యాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ ఫస్ట్ ఏసీతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీలో ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ఆధునిక ఫీచర్లు అందించారు.