Headlines

Vrushakarma Trailer: వృషకర్మ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన నాగచైతన్య


యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ  వృషకర్మపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. విభిన్నమైన కథాంశంతో, మిస్టరీ, మైథాలజీ, సూపర్ నేచురల్ అంశాల కలయికగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘విరూపాక్ష’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు అంతకుమించిన విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపినీడు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో 5 వేల సంవత్సరాల క్రితం నాటి పురాతన శిల్పాలు, వింత గుర్తులు, అంతుచిక్కని రహస్యాలను పరిచయం చేశారు. మొదట నిధి అన్వేషణగా ప్రారంభమయ్యే ప్రయాణం.. ఆ తర్వాత మానవాళికే ముప్పుగా మారే ఓ ప్రాచీన శక్తి చుట్టూ తిరుగుతున్నట్లు చూపించారు. సాధారణ మానవుల అవగాహనకు అందని వేద విజ్ఞానం, అతీంద్రియ శక్తులు, పురాతన కాలం నాటి నిగూఢ అంశాలతో కథను ఆసక్తికరంగా మలిచారు. ట్రైలర్‌లో నాగచైతన్య పాత్రకు సంబంధించిన అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సృష్టి ధర్మాన్ని కాపాడేందుకు దైవిక శక్తి ఎంపిక చేసిన వ్యక్తిగా ఆయన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో ‘వృషకర్మ’గా ఎలా మారాడు? అతడికి అప్పగించిన బాధ్యత ఏమిటి? వేల ఏళ్లుగా దాగి ఉన్న రహస్యం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.

‘విరూపాక్ష’తో థ్రిల్లర్ జానర్‌లో తనదైన ముద్ర వేసిన కార్తీక్ దండు.. ఈసారి మైథాలజీ, మిస్టరీ, సూపర్ నేచురల్ అంశాలను కలిపి భారీ స్థాయిలో సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. పురాతన చిహ్నాలు, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మొత్తానికి నాగచైతన్య కెరీర్‌లో ‘వృషకర్మ’ ఓ సరికొత్త ప్రయోగంగా నిలుస్తుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *