Headlines

మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌ బాత్‌రూమ్‌లో మృతశిశువు కలకలం.. విద్యార్ధిని ప్రసవం


మహబూబాబాద్‌, నవంబర్ 26: జిల్లాలోని ఓ మహిళా డిగ్రీ కళాశాల వసతిగృహంలో మృతశిశువు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌ స్నానాల గదిలో మగశిశువు మృతదేహాన్ని గుర్తించిన విద్యార్థినులు వెంటనే కళాశాల ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనతో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లాలోని ఓ మండలానికి చెందిన 19 ఏళ్ల యువతి నాలుగు నెలల క్రితం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ బాలికల డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరింది. అప్పటి నుంచి కళాశాల హాస్టల్‌లోనే ఉంటోంది. అయితే, అప్పటికే గర్భం దాల్చిన ఆమె ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు, అధ్యాపకులు, సంక్షేమ అధికారులకు తెలియకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం ఉదయం హాస్టల్‌ స్నానాల గదిలో మృతశిశువును కొందరు విద్యార్థినులు గుర్తించారు. వెంటనే ప్రిన్సిపల్‌కు విషయం తెలియజేశారు. మరోవైపు, అప్పటికే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విద్యార్థినులను అధ్యాపకులు ప్రశ్నించారు. వారిలో ఓ విద్యార్థిని తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్లు, అయితే ఆ శిశువు మృతి చెందినట్లు అంగీకరించింది.

దీంతో కళాశాల అధికారులు వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులకు, శిశు సంక్షేమ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు, పట్టణ పోలీసులు కళాశాలకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థిని నుంచి వాంగ్మూలం సేకరించి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు మహబూబాబాద్‌ సీఐ రఘుపతిరెడ్డి వెల్లడించారు. మరోవైపు, శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. శిశువు మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *