Headlines

ఆఫీసులో నిద్రమత్తు ఇబ్బందిపెడుతోందా..? ఇలా చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు!


రాత్రి బాగా నిద్రపోయినా చాలా మందికి ఉదయం ఆఫీసుకు వెళ్లిన తర్వాత కూడా పగటిపూట నిద్ర వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కళ్లు మూతపడటం, పదే పదే ఆవలింతలు రావడం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా ఆఫీసులో నిద్ర రావడం వల్ల పని సామర్థ్యం తగ్గడంతో పాటు రోజువారీ పనులపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే దీనికి కేవలం నిద్రలేమి మాత్రమే కారణం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.

పగటిపూట నిద్ర రావడానికి కారణాలేంటి?

రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం: రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోకపోయినా.. రాత్రి నిద్ర మధ్యలో పదే పదే మెలకువ వచ్చినా నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో పగటిపూట నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర సమయం సరిపోవడంతో పాటు నిద్ర నాణ్యత కూడా చాలా ముఖ్యమే.

ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, హైపోథైరాయిడిజం, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలు కొందరిలో పగటిపూట అధిక నిద్రకు కారణం కావచ్చు. నార్కోలెప్సీ వంటి నిద్ర సంబంధిత నాడీ వ్యవస్థ సమస్యల వల్ల కూడా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి



ఆహారపు అలవాట్లు: మధ్యాహ్నం ఎక్కువగా భోజనం చేయడం, అధికంగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల కొందరిలో భోజనం తర్వాత నీరసం, నిద్రమత్తు పెరుగుతుంది. వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా శక్తి స్థాయిలపై ప్రభావం చూపించే అవకాశముంది.

ఒకే చోట కూర్చొని పనిచేయడం: గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తే శరీరం బద్ధకంగా మారుతుంది. దీనివల్ల అలసట, ఆవలింతలు, నిద్రమత్తు పెరిగే అవకాశముంది.

ఆఫీసులో నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

1. కొద్దిసేపు నడవండి: గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి. వీలైతే ప్రతి గంటకు కొన్ని నిమిషాలు నడవడం లేదా నిలబడటం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది.

2. తేలికపాటి భోజనం చేయండి: మధ్యాహ్నం భారీగా భోజనం చేయకుండా తేలికపాటి, పోషకాహారాన్ని తీసుకోవాలి. భోజనంలో కూరగాయలు, పండ్లు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక చక్కెర, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది.

3. టీ లేదా కాఫీ పరిమితంగా తీసుకోండి: నిద్రమత్తుగా అనిపించినప్పుడు పరిమితంగా టీ లేదా కాఫీ తీసుకోవచ్చు. వీటిలో ఉండే కెఫీన్ కొంతసేపు యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే అధికంగా తీసుకోవడం వల్ల రాత్రి నిద్రకు ఆటంకం కలిగే అవకాశముంది.

4. డెస్క్ దగ్గరే చిన్నపాటి వ్యాయామాలు: కుర్చీలో కూర్చొని మెడను నెమ్మదిగా తిప్పడం, చేతులను చాపడం, పాదాలను కదిలించడం వంటి చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవచ్చు. ఇవి శరీరంలోని బిగుతును తగ్గించి చురుకుదనాన్ని పెంచుతాయి.

5. సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి: ఆఫీసులో ఎక్కువసేపు గదిలోనే ఉండకుండా విరామ సమయంలో బయటకు వెళ్లి కొద్దిసేపు నడవండి. సహజమైన వెలుతురు, స్వచ్ఛమైన గాలి మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

రాత్రిపూట తగినంత నిద్రపోతున్నప్పటికీ ప్రతిరోజూ పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గురక, నిద్రలో శ్వాస ఆగినట్లు అనిపించడం, ఉదయం తలనొప్పి, రోజంతా అలసట వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. స్లీప్ అప్నియా లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నాయేమో పరీక్షించుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన అంశాలు కేవలం అవగాహనకు మాత్రమే. పగటిపూట నిద్రమత్తు తరచుగా వస్తూ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *