
నల్ల బియ్యం.. దాని ప్రత్యేకమైన నలుపు రంగుతో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్ గా ప్రాచుర్యం పొందుతోంది. సాధారణంగా మనం చూసే తెల్ల బియ్యం రకాలకు భిన్నంగా, ఈ బియ్యం నల్లగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే, వీటి సాగు తక్కువగా ఉండటం వల్ల పూర్వకాలంలో వీటిని ఫర్ బిడెన్ రైస్ అని పిలిచేవారు. అప్పట్లో కేవలం చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వీటిని తినేవారు. నల్ల బియ్యం తినడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడి, ఎక్కువ కాలం జీవిస్తారని వారు నమ్మేవారు. నల్ల బియ్యం పుట్టుకపై పక్కా ఆధారాలు లేనప్పటికీ, మన దేశంలో మణిపూర్లో ఈ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. అక్కడ వీటిని స్థానికంగా చకోవా అమూబి అని పిలుస్తారు. మణిపురి భాషలో చకోవా అంటే నోరూరించేది అని, అమూబి అంటే నల్లనిది అని అర్థం. ఈ బియ్యం నల్లగా, నోరూరించే రుచితో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.
పోషక విలువల విషయానికి వస్తే, నల్ల బియ్యం సాధారణ తెల్ల బియ్యం కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠమైనది. పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో ప్రతి 100 గ్రాములకు 6.8 గ్రాముల ప్రోటీన్, 1.2 గ్రాముల ఐరన్, 0.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. దీనికి విరుద్ధంగా, నల్ల బియ్యంలో 18 రకాల అమినో యాసిడ్లు, కాపర్, కెరోటిన్ వంటి అనేక పోషకాలు, అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటివి లభిస్తాయి. ఇందులో అత్యధికంగా ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్లు బియ్యానికి ఆ నలుపు రంగును అందిస్తాయి. ఈ అధిక పోషకాల కారణంగానే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.
నల్ల బియ్యం ప్రయోజనాలు..
నల్ల బియ్యం అందించే ఆరోగ్య ప్రయోజనాలు విస్తృతమైనవి.. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అధిక ఫైబర్, తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల ఊబకాయ సమస్యను తగ్గించి, బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. దీన్ని మామూలు బియ్యానికి బదులు తినడం వల్ల బరువు వేగంగా తగ్గే అవకాశం ఉంది. నల్ల బియ్యంలో పుష్కలంగా ఉండే ఆంథోసైనిన్లు కంటి వ్యాధులను నయం చేయగలవు. అంతేకాకుండా, ఈ ఆంథోసైనిన్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నల్ల బియ్యం సాగు కూడా ప్రత్యేకమైనది. దీనికి చీడపీడల బాధ చాలా తక్కువ. కేవలం 100 రోజుల్లో పంట దిగుబడి చేతికొస్తుంది. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా దెబ్బతినదు, ఇది పర్యావరణ అనుకూలమైన పంటగా నిలుస్తుంది. అయితే, కొంతమంది ఆధునిక కాలంలోనూ నల్ల బియ్యం ప్రాధాన్యతను గుర్తించి, కొందరు దీని సాగుకు కృషి చేస్తున్నారు.
పోషక గుణాలు అధికంగా ఉన్న నల్ల బియ్యానికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఈ బియ్యాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. నల్ల బియ్యం కేవలం ఒక ఆహార ధాన్యం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే ఒక అద్భుతమైన వరం అనడంలో ఎలాంటి సందేహం లేదు..