సాధారణంగా ఒక కంపెనీ నుంచి గ్రాట్యటీ పొందాలంటే అదే సంస్థలో ఐదేళ్లు నిరంతరాయంగా పని చేసి ఉండాలి. ఐదేళ్ల కంటే ఒక్కరోజు తక్కువ అయినా గ్రాట్యటీని కంపెనీలు చెల్లించవు. అయితే తాజాగా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే రాజీనామా చేసిన ఉద్యోగులు గ్రాట్యటీ పొందేందుకు అనర్హులని భావించకూడదని స్పష్టం చేసింది. వాస్తవ పనిదినాలు, గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972లోని నిబంధనలను తెలుసుకోవాలని సూచించింది. ఈ చట్టంలోని కొన్ని షరతులకు మీరు అర్హత సాధించినట్లయితే ఐదేళ్ల ముందే గ్రాట్యుటీ పొందే అవకాశముందని తెలిపింది. ఐదేళ్ల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో పనిచేసే ఓ మాజీ అసిస్టెంట్ ఇంజనీర్ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల 12 రోజులు పనిచేశాడు. ఐదేళ్ల కాలం పనిచేయనందున అతడికి వచ్చే రూ. 1.75 లక్షల గ్రాట్యుటీని చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దీంతో ఉద్యోగి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అనుకూలమైన తీర్పునిచ్చింది. రూ.1.75 లక్షల గ్రాట్యుటీతో పాటు 10 శాతం వడ్డీని కూడా అతడికి చెల్లించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం గ్రాట్యుటీకి అర్హత పొందాలంటే ఉద్యోగి ఐదేళ్లు పని చేసి ఉండాలి. అయితే నిరంతర సేవను నిర్ధారించడానికి షరతులను నిర్దేశించే సెక్షన్ 2A నుండి విడిగా ఈ నిబంధనను పరిగణించలేమని కోర్టు పేర్కొంది.
సెక్షన్ 2A ప్రకారం, ఒక ఉద్యోగి 12 నెలల కాలంలో కనీసం 240 రోజులు పనిచేస్తే.. ఒక సంవత్సరం నిరంతర సేవను పూర్తి చేసినట్లుగా పరిగణించవచ్చని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఉద్యోగి చేరిన, రాజీనామా చేసిన తేదీల మధ్య ఉన్న క్యాలెండర్ కాలాన్ని లెక్కించడం ద్వారా మాత్రమే యజమానులు గ్రాట్యుటీ అర్హతను నిర్ణయించలేరని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు వాస్తవంగా పనిచేసిన రోజుల సంఖ్యతో పాటు సెక్షన్ 2A కింద డీమింగ్ నిబంధన వర్తిస్తుందో లేదో కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. సెక్షన్ 4(1)తో కలిపి సెక్షన్ 2A కింద పరిశీలించాలని కోరింది. ఈ వ్యక్తి జూలై 6, 2017న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరాడు. మార్చి 19, 2022న రాజీనామా చేయగా.. ఏప్రిల్ 18, 2022న సర్వీసు నుండి రిలీవ్ చేయబడ్డాడు. అయితే ఐదో సంవత్సరం సర్వీసులో 240 రోజులకు పైగా పనిచేసినందున తనకు గ్రాట్యుటీ చెల్లించేలా కంపెనీని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో హైకోర్టులో అతడికి ఊరట కలిగింది.