Headlines

కన్నులపండువగా శ్రీశైల మల్లన్న జ్వాలాతోరణం.. శివనామస్మరణతో మారుమోగిన క్షేత్రం


నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తడంతో క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా, కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం నిర్వహించింది. ముందుగా ఆలయ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారుచేసిన వత్తులను నెయ్యితో తడిపి ఉంచారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.

ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకీలో ఊరేగింపుగా తరలిరాగా, గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దివిటీలతో జ్వాలాతోరణాలను వెలిగించారు. ఆ సమయంలో భక్తులు ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకరా అంటూ చేసిన శివ నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది. భారీగా తరలివచ్చిన భక్తులు జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించుకుని పునీతులయ్యారు.

ఓ పక్క గంగాధర మండపం వద్ద వత్తులు మంటలతో వెలుగుతుండగా, మరోపక్క భక్తులు ఆ జ్వాలాతోరణం కింది నుంచి దాటుతూ తమ భక్తిని చాటుకున్నారు. జ్వాలాతోరణం వత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *