Headlines

భార్య ఆసుపత్రిలో.. భర్త మంచానికే పరిమితం.. న్యాయం కోసం అంబులెన్స్‌లో పోలీసుల వద్దకు!


సిరిసిల్ల (రాజన్న సిరిసిల్ల జిల్లా): కన్నకొడుకులే ఉన్నా, కష్టకాలంలో ఆదుకునే దిక్కులేక ఓ వృద్ధ దంపతులు పడుతున్న వేదన స్థానికులను కంటతడి పెట్టించింది. పక్షవాతంతో భార్య ఆసుపత్రిలో మగ్గుతుండగా, కాలు విరిగి మంచానికే పరిమితమైన భర్త తన గోడు వెళ్లబోసుకునేందుకు అంబులెన్స్‌లోనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హృదయవిదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన లింబాద్రి, రేణుక దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో ముగ్గురు కుమారులు శివ, అంబదాస్, నరేష్ వివాహాలు చేసుకుని వేరుగా ఉంటున్నారు. తమ వద్ద ఉన్న ఆస్తులన్నింటినీ తీసుకున్న తర్వాత ఆ ముగ్గురు కుమారులు తమను పూర్తిగా విస్మరించారని లింబాద్రి కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం తన భార్య రేణుక పక్షవాతంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తాను కాలు విరిగి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యానని వాపోయారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో చిన్న కుమారుడు రాజు మాత్రమే తమకు అండగా నిలుస్తున్నాడని, మిగతా ముగ్గురు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబులెన్స్ వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించిన సీఐ..

నడవలేని నిస్సహాయ స్థితిలో అంబులెన్స్‌లో స్టేషన్ ఆవరణకు చేరుకున్న లింబాద్రి పరిస్థితిని చూసి సీఐ శ్రీనివాస్ చలించిపోయారు. వృద్ధుడు వాహనం నుంచి కిందకు దిగలేని స్థితిని గమనించిన సీఐ, స్వయంగా స్టేషన్ బయటకు వచ్చి అంబులెన్స్ వద్దనే ఆయన నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యతల నుంచి తప్పుకున్న కుమారులపై వృద్ధుల సంరక్షణ చట్టం (Senior Citizens Act) కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, వృద్ధ దంపతులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వృద్ధులకు భరోసా కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *