Headlines

కార్తీక పౌర్ణమికి పడవల పండుగ.. నీటిలో దీపాలతో పడవలను ఎందుకు వదులుతారో తెలుసా?


Kartik Purnima Boita Bandana History: కార్తీక మాసంలోని పౌర్ణమిని దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత, సంప్రదాయం ఉంది. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24, 2026న వచ్చింది. ఉత్తర భారతదేశంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఒడిశాలో మాత్రం కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అదే ‘బోయిట బందన (Boita Bandana)’. ఈ రోజున తెల్లవారుజామునే ప్రజలు నదులు, చెరువులు, సముద్ర తీరాలకు చేరుకుని చిన్న చిన్న పడవలను నీటిలో వదులుతారు. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న చరిత్ర, విశ్వాసాలు ఏమిటో తెలుసుకుందాం.

బోయిట బందన అంటే ఏమిటి?

ఒడిశాలో కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే పడవల పూజను బోయిట బందన అంటారు. బోయిట అంటే పడవ లేదా ఓడ, బందన అంటే పూజించడం. ఈ సంప్రదాయంలో భాగంగా ప్రజలు అరటి కాండాలు, కాగితం వంటి వాటితో చిన్న పడవలను తయారు చేస్తారు. వాటిని పూలు, ఆకులు, రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. అనంతరం వాటిలో దీపాలు, తమలపాకులు, వక్కలు, పువ్వులు, నాణేలు ఉంచి నదులు, చెరువులు, సముద్రంలో వదులుతారు. ఇలా దీపాలతో వెలుగులు విరజిమ్మే చిన్న పడవలు నీటిపై తేలుతూ కనువిందు చేస్తాయి.

ఒడిశా సముద్ర వాణిజ్య చరిత్రకు గుర్తుగా..

బోయిట బందన సంప్రదాయం వెనుక ఒడిశా ప్రాచీన సముద్రయాన చరిత్ర దాగి ఉంది. పూర్వం ఒడిశాను కళింగ దేశంగా పిలిచేవారు. అప్పట్లో కళింగ వ్యాపారులు పెద్ద పెద్ద నౌకల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ ఇండోనేషియా, జావా, సుమత్రా, బాలి వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసేవారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి.

కార్తీక పౌర్ణమి సమయంలో సముద్ర ప్రయాణాలకు అనుకూలమైన గాలులు వీస్తాయని భావించి, వ్యాపారులు ఈ సమయంలో ప్రయాణాలు ప్రారంభించేవారు. వారు సురక్షితంగా వెళ్లి, క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు కోరుకునేవారు. అందులో భాగంగానే మహిళలు నదీ తీరాలకు చేరుకుని పడవలకు పూజలు చేసి, దీపాలు వెలిగించి వీడ్కోలు పలికేవారనే సంప్రదాయ విశ్వాసం ఉంది. నేటి బోయిట బందన ఆచారం ఈ సముద్రయాన వారసత్వాన్ని గుర్తుచేస్తుంది.

ఆ కా మా బోయ్’ పాటకు ప్రత్యేకత

ఈ వేడుకలో ‘ఆ కా మా బోయ్, పాన్ గువా తోయ్’ అనే సంప్రదాయ ఒడియా జానపద గీతాన్ని ఆలపించడం మరో ప్రత్యేకత. ఈ పాటలో పూర్వకాలపు సముద్ర వాణిజ్యం, వ్యాపార ప్రయాణాల జ్ఞాపకాలు కనిపిస్తాయి. పడవలను నీటిలో వదులుతూ ప్రజలు తమ కుటుంబాల సుఖసంతోషాలు, సౌభాగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.

విశ్వాసం, చరిత్ర కలగలిసిన పండుగ

బోయిట బందన కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. ఇది ఒడిశా ప్రజల చారిత్రక వారసత్వానికి ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడం, ఆలయాలను సందర్శించడం, దీపదానం చేయడం, పేదలకు దానధర్మాలు చేయడం కూడా ముఖ్యమైన ఆచారాలుగా భావిస్తారు. ఇలా భక్తి, ప్రకృతి ఆరాధన, పూర్వీకుల చరిత్ర కలగలిసిన బోయిట బందన ఒడిశా సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న సంప్రదాయాలు, ఆచారాలు ఒడిశా ప్రాంతీయ సంస్కృతి, మత విశ్వాసాలు, చారిత్రక కథనాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని ప్రాంతీయ సంప్రదాయాలుగా మాత్రమే పరిగణించాలి.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *