Headlines

Andhra News: అర్ధరాత్రి చీకట్లో వింత ఆకారం.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..


మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లె గ్రామంలో ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా పరిస్థితి తయారైంది. గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తోందంటూ కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా ఓ ఇంట్లోకి ప్రవేశించి పులి నీరు తాగుతున్నట్లుగా ఉన్న ఆ దృశ్యాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.

స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ పెద్దపులి గ్రామంలోకి ప్రవేశించి, ఒక ఇంటి ఆవరణలో సంచరించినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో పులి రోడ్డుపై తిరుగుతుండగా అక్కడే దాబాల్లో పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన కొందరు యువకులు దానిని వీడియో తీసినట్లు సమాచారం. ఈ వీడియో బయటకు రావడంతో బోడిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావడం పూర్తిగా మానేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, పశువుల భద్రతపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల క్రితం మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని ఊరకొండ వద్ద ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందగా, మరో రెండు తీవ్రంగా గాయపడ్డాయి. అప్పట్లో అటవీశాఖ సిబ్బంది ఆవు మృతదేహం వద్ద ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా, రాత్రి సమయంలో మృతదేహం వద్దకు వచ్చిన పెద్దపులి దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. దీంతో అది పెద్దపులి పనేనని అధికారులు నిర్ధారించారు.

ఆ ఘటన ఇంకా మరువకముందే ఇప్పుడు బోడిరెడ్డిపల్లిలో పులి వీడియోలు రావడంతో రైతులు, పశువుల కాపరులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పులి వీడియోలపై అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. మార్కాపురం ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం, యర్రగొండపాలెం రేంజ్ అటవీ సిబ్బంది బోడిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

అయితే, ఆ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గానీ, అది సంచరించినట్లుగా ఇతర ఆధారాలు గానీ ఏవీ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామస్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలకు గురికావద్దని కోరారు. ఒకవేళ వన్యప్రాణుల సంచారం నిర్ధారణ అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే అన్ని రక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *