సముద్రపు లోతైన జలాల్లో ఎన్నో వింతలు, విశేషాలు దాగుంటాయి. వాటిలో కొన్నింటి గురించి వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాంటి విచిత్రమైన జీవి సైమోథోవా ఎక్సిగ్వా. చేపల నోట్లోకి చొరబడి, వాటి నాలుకను తినేసి, ఆ తర్వాత తానే ఆ చేపకు కొత్త నాలుకగా మారిపోయే ఈ పరాన్నజీవి తీరు ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే సముద్రంలో లేదా నదులలో ఈత కొట్టే మనుషులకు దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇది కేవలం చేపలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా దీనిని నాలుకను తినే పేను అని పిలుస్తారు. ఇది కేవలం 0.3 నుండి 1.1 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. చూడటానికి ఏదో గ్రహాంతర జీవిలా కనిపిస్తుంది. శరీరం మొత్తం గట్టి పెంకుతో కప్పబడి ఉండటమే కాకుండా పట్టుకోవడానికి, చీల్చడానికి వీలుగా ఏడు జతల బలమైన కాళ్లు ఉంటాయి. ఇవి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీటిలో, ముఖ్యంగా కాలిఫోర్నియా నుండి ఈక్వెడార్ వరకు ఉన్న తీరప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
చేప నోటిని ఎలా స్వాధీనం చేసుకుంటుంది?
ఈ జీవి ప్రయాణం ఒక ఆసక్తికరమైన ప్రక్రియతో మొదలవుతుంది.
తొలి దశ: జీవితపు తొలిదశలో వీటిని మంకా అంటారు. ఆ సమయంలో ఇవి సముద్రపు అడుగుభాగంలో స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి.
లక్ష్యం ఎంచుకోవడం: ఆ తర్వాత జీవితాంతం ఉండేందుకు అనువైన చేప కోసం వేట మొదలుపెడతాయి. స్నైపర్లు, గ్రాంట్లు, డ్రమ్ములు వంటి చేపలను ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి.
నోట్లోకి ప్రవేశం: నచ్చిన చేప దొరికిన వెంటనే మొప్పల చుట్టూ తిరుగుతూ, అవకాశం దొరికినప్పుడు మొప్పల ద్వారా చేప నోట్లోకి ప్రవేశిస్తాయి.
నాలుక స్థానంలోకి: నోట్లోకి వెళ్లాక తన ఏడు జతల కాళ్లతో నాలుకను గట్టిగా పట్టుకుని రక్తనాళాలను తెంచేస్తుంది. రక్తప్రసరణ ఆగిపోవడంతో కొన్ని రోజుల్లోనే అసలు నాలుక ఎండిపోయి రాలిపోతుంది. ఆ ఖాళీలో మిగిలిన నాలుకకు ఇది అతుక్కుని, చేపకు కొత్త నాలుకలా పనిచేస్తుంది.
చేప అందించే రక్తం, లాలాజలాన్ని తీసుకుంటూ ఇది జీవిస్తుంది. విచిత్రమేమిటంటే, చాలా చేపలు ఈ కొత్త నాలుకకు అలవాటుపడి సాధారణ జీవితాన్ని కొనసాగిస్తాయి.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
ప్రకృతిలోని ఈ వింత పరిణామం పరిశోధకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై 2012లో బయోలాజికల్ జర్నల్ ఆఫ్ ది లిన్నియన్ సొసైటీలో ఒక పరిశోధనకు సంబంధించిన అంశాలు ప్రచురితమయ్యాయి. వీటి పునరుత్పత్తి, జీవనశైలి గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటిలో సుమారు 100 జాతులు ఉండగా, ఎనిమిది ప్రజాతులుగా వర్గీకరించారు. వాటిలో సైమోథోవా, సెరటోతోవా ప్రధానమైనవి. వీటిలో సెరటోతోవా చేప శరీరం నుండి నేరుగా పోషకాలను గ్రహిస్తూ మరింత హానికరంగా ఉంటుందని సమాచారం. ఇక సైమోథోవా ఎక్సిగ్వాను 2005లో యూకేలో మొదటిసారిగా గుర్తించారు.