
మన రోజువారీ వంటల్లో వాడే ఉప్పు కేవలం రుచిని మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికీ కీలకం. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సక్రమంగా ఉత్పత్తి చేయడానికి అయోడిన్ అవసరం. శరీరంలో అయోడిన్ లోపిస్తే గాయిటర్, హైపోథైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉప్పులలో ఏది థైరాయిడ్‌కు మేలు చేస్తుందో తెలుసుకోవడం అవసరం.
అయోడైజ్డ్ ఉప్పు – థైరాయిడ్‌కు ప్రాధాన్యం
థైరాయిడ్ సమస్యలు రాకుండా కాపాడటంలో అయోడైజ్డ్ ఉప్పు ప్రధానంగా ఉపయోగపడుతుంది. దీనికి అయోడిన్ కలిపి ఉండటం వల్ల శరీరానికి అవసరమైన అయోడిన్ అందుతుంది. అందుకే అయోడిన్ లోపం వల్ల వచ్చే థైరాయిడ్ సమస్యలను నివారించడానికి అయోడైజ్డ్ ఉప్పును ఎంచుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తారు.
ఇతర ఉప్పు రకాల ప్రత్యేకతలు, పరిమితులు
రాతి ఉప్పు / సైంధవ లవణం: పూజలు, ఉపవాస సమయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో అయోడిన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ ఉన్నవారు దీన్నే పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు.
నల్ల ఉప్పు: చాట్, పెరుగు వంటి వాటిలో వాడతారు. జీర్ణ సంబంధిత అసౌకర్యాలకు ఉపయోగిస్తుంటారు. ఇందులోనూ అయోడిన్ తక్కువగానే ఉంటుంది.
సముద్రపు ఉప్పు / కల్లుప్పు: సముద్రపు నీటి నుంచి లభిస్తుంది. సహజ అయోడిన్ ఉన్నా ప్రాసెసింగ్ సమయంలో తగ్గొచ్చు.
పింక్ సాల్ట్: ఇటీవల ఎక్కువగా వాడుతున్నప్పటికీ, ఇందులో అయోడిన్ తక్కువగా ఉంటుంది. ట్రెండ్ కారణంగా దీనినే వాడితే అయోడిన్ లోపం తలెత్తే అవకాశం ఉంది.
బీపీ ఉన్నవారు, తీసుకోవాల్సిన మోతాదు, నిల్వ జాగ్రత్తలు
రక్తపోటు ఉన్నవారు కూడా ఉప్పును తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఏ రకమైన ఉప్పు అయినా అధికంగా తింటే బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది; సాధారణంగా రోజుకు 5 గ్రాముల (సుమారు టీస్పూన్) మించకుండా చూడాలి. వంట చేసేటప్పుడు అధిక వేడికి అయోడిన్ ఆవిరైపోయే అవకాశం ఉన్నందున ఉప్పును చివర్లో కలపడం మంచిది. అలాగే గాలి చొరబడని, మూత గట్టిగా ఉండే డబ్బాలో ఉప్పును భద్రపరచాలి. థైరాయిడ్ లేదా బీపీ సమస్యలు ఉంటే ఆహార నియమాలపై వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..